మణికొండ, జనవరి 29 : జీవితంలో ఎంతో సంపాదించొచ్చు. కానీ చదువును కొనలేం. విద్య వికాసాన్ని పెంచుతుంది. మనిషి అభ్యున్నతికి బాటలు వేస్తుంది. అరకొర వసతులున్న పాఠశాలలో చదువుకున్న వారు ఎక్కడెక్కడో ఉన్నత స్థానాల్లో స్థిరపడుతారు. తాము అక్షరాలు నేర్చిన పాఠశాల అభివృద్ధిని పట్టించుకోరు. కానీ మూడు సంస్థలు పాఠశాల బాధ్యతను నెత్తిన వేసుకొని కార్పొరేట్‌కు దీటుగా నిలిపారు. చక్కటి భవనం కట్టించి, అన్ని వసతులు కల్పించి ఔరా అనేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించే ‘మన ఊరు- మన బడి’ లక్ష్యానికి తగినట్లు అడుగులు వేసి ఆదర్శంగా నిలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, నోవాటెల్, రౌండ్‌టేబుల్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత ఖర్చుతో పాఠశాల భవనాన్ని సుందరంగా నిర్మించారు. అంతేకాదు తరగతి గదుల్లో అవసరమైన సామగ్రి అందజేశారు.
దశమార్చిన దాతలు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలోని నార్సింగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పింది. ఇక్కడ అభ్యసించిన వారంతా రాజకీయ, ఉద్యోగ,వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఏనాడు సాయం చేసింది లేదు. కానీ సర్కారు బడులను బాగుచేయాలన్న సంకల్పంతో ఎమ్మార్ ప్రాపర్టీస్, నోవాటెల్, రౌండ్‌టేబుల్ సంస్థలు ముందుకొచ్చి పాఠశాలలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చివేసి రెండంతస్తులు నిర్మించడంతోపాటు మరో భవనంపై అంతస్తు నిర్మించారు. విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, పాఠాలు వినేందుకు ప్రొజెక్టర్లు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లను నిర్మించారు. వీటికి రూ.60 లక్షలు వెచ్చించాయి ఆ సంస్థలు. నిర్మాణం పూర్తయిన భవనాలను ఇటీవల ప్రారంభించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్‌కు అప్పగించారు.
ఆంగ్లంతో సర్కారు బడులకు కొత్త కళ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనుండటంతో ప్రభుత్వ బడులకు కొత్త కళ రానుంది. కనీస సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నార్సింగి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 600 పైచిలుకు విద్యార్థులు అభ్యసిస్తుండడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక చొరవ తీసుకొని కొత్త భవనాలు, ప్రహరీల నిర్మాణం, డిజిటల్ తరగతులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక ఆంగ్లవిద్య అందుబాటులో లేక చాలామంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ఫీజుల భారం, శిక్షణ పొందని ఉపాధ్యాయుల బోధనపై అసంతృప్తితో విద్యార్థులు ప్రైవేటు నుంచి సర్కారు బడులకు వలసకడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రధానంగా పేద విద్యార్థులకు వరంగా మారనుంది.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే ‘మన ఊరు..మనబడి’తో సర్కారు బడులకు పూర్వ వైభవం రానుంది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులకు ఇంగ్లిషు బోధన అవసరం. తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు వేలకువేలు పోసి ఇంగ్లిష్ మీడియం చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమం ఉండడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
-విజయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు
విద్యతోనే లక్ష్య సాధన
విద్యతోనే అనుకున్న లక్ష్యాలను సాధించే శక్తి ఉంటుంది. విద్యాభివృద్ధికి మాకు తోచిన విధంగా సహకారం అందించాలన్న సంకల్పంతో పాఠశాలకు సాయం చేశాం. దీనికితోడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి చేయూతనందించిన వారమవుతాం. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. పదితరాలకు గుర్తుండేలా పాఠశాల తరగతి గదులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాం.
-ఎమ్మార్ ప్రాపర్టీస్ సీఎఫ్‌వో మధుసూదన్‌రావు, నోవాటెల్ జీఎం మనీష్ దవ్వ