సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకు గంజాయితో మత్తు చాక్లెట్లు తయారు చేశారు.. లిక్కర్‌తో మద్యం చాక్లెట్లూ రూపొందించారు.. ఇప్పుడు ఏకంగా విస్కీతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసి.. అమ్ముతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ, ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి, ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావు వివరాలు వెల్లడించారు.
నగరానికి చెందిన శరత్‌చంద్రారెడ్డి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5లో హరికేఫ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌ను నిర్వహిస్తున్నాడు. యువతను ఆకర్శించి.. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే దిశగా నిబంధనలకు విరుద్ధంగా మద్యంతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసి.. విక్రయిస్తున్నాడు. దయాకర్‌రెడ్డి, శోభన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ మత్తు ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు గుర్తించారు.
ఫేస్బుక్ ద్వారా ప్రకటనలు చేస్తూ యువతను ఆకర్శిస్తున్నట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నం.1, 5లోని ఐస్‌క్రీమ్ పార్లర్లపై దాడులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11.5 కిలోల విస్కీ ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.