Banjarahills | బంజారాహిల్స్, జూన్ 15 : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలు చేయడం వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నెంబర్ 403లోకి వచ్చే టీఎస్ నెంబర్ 5, బ్లాక్ హెచ్, వార్డు 10లో సుమారు 2 వేల గజాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. తెలంగాణ భవన్ ముందు నుంచి రోడ్ నెం 12కి కొత్తగా వేసిన లింక్ రోడ్డుకు ఒకవైపు పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం ఉండగా రెండోవైపున ఉన్న ఈ ఖాళీ ప్రభుత్వ స్థలంలో గతంలోనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా ఈ స్థలం తమదంటూ గతంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలకు ప్రయత్నించగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో బౌన్సర్లు, ప్రైవేటు సెక్యురిటీ సిబ్బందితో వచ్చిన వ్యక్తులు సుమారు 1000 గజాల స్థలంలోకి ప్రవేశించారు. స్థలంలోని ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించడంతో పాటు స్థలం చుట్టూ గుంతలు తవ్వి కాంక్రీట్ ఫుటింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ బ్లూషీట్స్ వేశారు. స్థానికులు ప్రశ్నించగా ఈ స్థలం పవన్‌కుమార్ అనే వ్యక్తిదని ఈ స్థలంలోకి రెవెన్యూ అధికారులు ప్రవేశించకుండా హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నాయంటూ దబాయించారు. ఈ స్థలంతో కలిపి మొత్తం 2 వేల గజాల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని, ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 60 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా సర్వే నెంబర్ 129/104(ఓల్డ్)(403/53న్యూ)లోకి వచ్చే ఈ స్థలాన్ని తమ తండ్రి 1967లో కొనుగోలు చేశాడని, దీన్ని తనపేరుతో 1987లో గిఫ్ట్‌డీడ్‌గా చేయగా అప్పటినుంచి తమ ఆధీనంలోనే ఉందంటూ పవన్ కుమార్ తెలిపారు. తమకు రెవెన్యూ సిబ్బంది ఇబ్బంది పెడుతూ ఫెన్సింగ్ వేసుకోనివ్వకపోవడంతో హైకోర్టులో కేసు వేసి ఆదేశాలు తెచ్చుకున్నామని పేర్కొన్నారు.
నాన్ ఎగ్జిస్టింగ్ సర్వే నెంబర్‌తో ఆదేశాలు : షేక్‌పేట తహసీల్దార్ అనితా రెడ్డి
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కమాండ్ కంట్రోల్ పక్కనున్న 2వేల గజాలు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ స్థలంగా ఉందని, ఇదంతా సర్వే నెంబర్ 403లోకి వస్తుందని షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు. ఈ స్థలం సర్వే నెంబర్ 129/104(ఓల్డ్)లోనిది అంటూ కొంతమంది ఈ స్థలంపై కోర్టు ఆదేశాలు తెచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కోర్టు తీర్పులో పేర్కొన్న సర్వే నెంబర్ నాన్ ఎగ్జిస్టింగ్ నెంబర్ అని వివరించారు. బ్లూ షీట్లు వేసుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, కోర్టు ఆదేశాలు పరిశీలించి నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగిస్తామని పేర్కొన్నారు.