ఖైరతాబాద్, ఏప్రిల్ 24 : ప్రభుత్వ పార్కు స్థలం గోడను కూల్చి వేసి.. ఓ బిల్డర్ ఏకంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. నిర్మాణ వ్యర్థాలు, మట్టిని ఆ స్థలంలో వేసి, హద్దులు మాయం చేసి.. పార్కు ముఖచిత్రాన్నే మార్చివేశాడు. ఇంతా జరుగుతున్నా.. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సోమాజిగూడ డివిజన్ బీఎస్ మక్తా కీర్తిలాల్ లేన్, నిశాంత్బాగ్లోని ప్లాట్ నం.10లోని 782 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. రెవెన్యూ రికార్డు ప్రకారం.. ఈ స్థలం పార్కుకు కేటాయించినట్లు ఉంది. గతంలో వెయ్యి గజాలకు పైగా ఉండేది. ప్రస్తుతం కబ్జాలకు పోగా, కేవలం 782 గజాలు మాత్రమే మిగిలింది. కాగా, కొంత కాలంగా స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి హస్తంతో ఈ స్థలం కబ్జాకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా ఓ బిల్డర్ ఏకంగా ఈ స్థలం పక్కనే భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తూ, పార్కు స్థలం గోడ అడ్డు ఉందని, దానిని మొత్తం తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
హద్దులు మాయం..లక్షలాది రూపాయల నజరానాలు?
నెల రోజుల కిందట పార్కు స్థలం పక్కనే ఉన్న ఖాళీ జాగాలో బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఓ బిల్డర్ పార్కు గోడను కూల్చివేయడంతో పాటు నిర్మాణ వ్యర్థాలు, మట్టి మొత్తం అందులోనే వేశాడు. ఈ వ్యవహారం బయటకు రాకుండా, ఎవరూ ప్రశ్నించకుండా కొందరికి లక్షలాది రూపాయలు నజరానాలు ముట్టచెప్పినట్లు సమాచారం. నిర్మాణంలో పార్కు స్థలం హద్దుల లెక్కలు సైతం తప్పినట్లు తెలుస్తున్నది. నెల రోజులుగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నా.. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిధులు పక్కదారి పట్టించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధి..?
రెండేండ్ల కిందట ఈ పార్కు స్థలాన్ని స్థానికులు రచ్చబండగా నామకరణం చేసి.. వివాహాది శుభకార్యాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికులకు ఈ స్థలం అన్ని రకాలుగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇక్కడ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని సంకల్పించింది. అంతేకాకుండా రూ.2 కోట్లు సైతం మంజూరు చేసింది. రెవెన్యూ శాఖ నుంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతులు సైతం వచ్చాయి.
2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి పార్టీ మారడంతో పాటు ఆ నిధులను సైతం పక్కదారి పట్టించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలం ధర రూ.30 కోట్లకు పైమాటే అంటున్నారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి స్థానిక బస్తీ పెద్దలు కొందరికి ‘కోటి రూపాయలు ఇస్తా….నోరు మూసుకొని కూర్చోండి’ అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. స్థానిక బస్తీవాసులు మాత్రం ఇక్కడ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించి తమకు అందుబాటులోకి తీసుకురావాలని బలంగా కోరడంతో ప్రజాప్రతినిధి, బస్తీ పెద్దలు వెనకడుగు వేసినట్లు తెలిసింది. ఇటీవల తన అనుచరులకు ఖైరతాబాద్‌లోని డబుల్ బెడ్రూం గృహాలు ఇప్పించిన ఆ ప్రజాప్రతినిధి కన్ను ఈ ఖరీదైన స్థలంపై పడినట్లు విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బస్తీవాసులు కోరుతున్నారు.