ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 12: స్వయం పోర్టల్ వేదికగా ఎనిమిది కొత్త కోర్సులతో పాటు మొత్తం 11 కోర్సుల రూపకల్పనకు ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆయా కోర్సుల్లో 50 చొప్పున పాఠ్యాంశాల రూపకల్పనకు కోర్సు కోఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు, ఈఎంఆర్సీ డైరెక్టర్ పి. రఘుపతిరెడ్డి మెమోరండం ఆఫ్ అగ్రిమెంట్‌పై బుధవారం సంతకాలు చేశారు. ఈఎంఆర్సీలో నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన రెండు ఎడిట్ సూట్లను అధికారులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వయం ఆన్లైన్ కోర్సుల వివరాలు పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ డిజిటల్ విద్యలో ఈఎంఆర్సీ చేస్తున్న కృషిని కొనియాడారు. రానున్న కాలంలో కోర్సుల సంఖ్య వందకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్‌కుమార్ నాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ లావణ్య, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.