చిక్కడపల్లి, మే 15: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించిన డబ్బులను ఆఖరి పనిదినాన్నే అందించాలని, ఇప్పటికే ప్రభుత్వం బకాయిపడ్డ నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం బాగ్‌లింగంపల్లిలోని సంస్థ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల కన్వీనర్ జోగు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో దాసు సురేష్ మాట్లాడుతూ.. ఒక్కొక్క ఉద్యోగి దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించి పదవీ విరమణ చేయగా వారికి రావలసిన పీఎఫ్, గ్రాడ్యూటీ, వేతన సవరణ బెనిఫిట్, జీపీఎఫ్లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక బందులకు గురవుతున్నారని చెప్పారు. పిల్లల పెళ్లిళ్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చదువులకు కావాల్సిన డబ్బులు సర్దుబాటు కాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులు ఉన్నాయి..
కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులకు తీసుకొచ్చి వాటిని తిరిగి సకాలంలో చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. వీరందరికీ న్యాయం చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క వీరికి ఇవ్వాల్సిన డబ్బులకు నిధులు కేటాయించకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం జాప్యం లేకుండా చెల్లించడం ఎంతవరకు సబబు అని సురేష్ ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణ రైజింగ్ అంటూనే మరోపక్క ఇప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని తనను కోసినా రూపాయి రాదని ఉద్యోగులను మానసిక వేదనకు గురిచేస్తున్నారన్నారు. త్వరలో రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తులసి సత్య నారాయణ, ఎంబీసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సురేశ్ , ఉపాధ్యాయ నాయకులు.. రామ్ మోహన్, బీసీ రాజ్యాధికార సమితి నాయకులు నరేందర్, పద్మావతి, తాళ్ల భాగ్యలక్ష్మి, కరుణశ్రీ, కృష్ణ గౌడ్, జ్యోతి గౌడ్, శారద, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.