సిటీబ్యూరో, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ): బోయిన్ పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ ను తగ్గించే విధంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు గురువారం కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్‌తో కలిసి జక్కుల మహేశ్వర్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి రెండు ప్రతిపాదనలు సూచిస్తూ వినతి పత్రం అందజేశారు.
ఎస్ఆర్ డీపీ కింద గతంలో ప్యారడైజ్ క్రాస్ రోడ్స్ నుంచి సుచిత్ర సర్కిల్, ఎన్ హెచ్ -44లోని డైరీ ఫామ్ రోడ్డు వరకు ప్రతిపాదించబడిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం తో ట్రాఫిక్‌ను పెద్ద ఎత్తున తగ్గిస్తుందన్నారు. అదే విధంగా మొదట ప్రతిపాదిత వెడల్పును 200 అడుగుల నుంచి 150 అడుగులకు తగ్గించవచ్చని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం ఆరు లేన్ల రహదారిసరిపోతుందన్నారు.
దీంతో పాటు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ చర్యల్లో భాగంగా బాలంరాయ్ ఎక్స్ రోడ్స్ వద్ద ఉన్న టన్నెల్ ప్రపోజ్, తాడ్‌బండ్ ముస్లిం శ్మశానవాటిక నుంచి చిన్న తోకట్ట, బోయిన్ పల్లి ఎక్స్రోడ్ల ద్వారా సుచిత్ర ఎక్స్‌రోడ్ వరకు కొనసాగుతుందని తెలిపారు. అయితే సొరంగ మార్గాన్ని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వరకు కొనసాగించి, ఆపై కుడి మలుపు తీసుకుంటే బోయిన్ పల్లి ఎక్స్- రోడ్లలో కలుస్తుందని చెప్పారు. దీని వల్ల చాలా ఆస్తులు, దేవాలయాలు, దర్గాలు, మసీదులను కోల్పోకుండా ఉండటంతో పాటు చిన్న తోకట్ట ప్రజలకు ఇవ్వాల్సిన పరిహార మొత్తాన్ని తగ్గించడంలో ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు. కారిడార్ నిర్మాణంలో భాగంగా గూగుల్ మ్యాప్ నమూనాను
జతపరిచినట్లు వెల్లడించారు.