EBRTS | ఫోర్త్ సిటీకి మెట్రో మోజులో నగరంలో అధునాతన రవాణా సౌకర్యాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శఠగోపం పెడుతున్నది. దాదాపు రూ. 3వేల కోట్ల అంచనా వ్యయంతో కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు ఈబీఆర్టీఎస్ (ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం) తీసుకురావాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఈబీఆర్టీఎస్ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. అధునాతన రవాణా కంటే, జనసంచారం లేని ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని చూస్తోంది. కూకట్ పల్లి జంక్షన్ మీదుగా నిత్యం వేలాది మంది ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగించే ప్రాజెక్టును పక్కన పెట్టేసింది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
మెట్రో విస్తరణకు అనువుగా లేని, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలివెటేడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టులను నిర్మించాలని హైదరాబాద్ అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ ప్రత్యేక నివేదిక రూపొందించింది. ఇందులో భాగంగా నగరంలో మొదట దశలో దాదాపు 70 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి వచ్చింది. కానీ ఎప్పుడో నిర్మించాల్సిన బీఆర్టీఎస్ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు కాగితాలకే పరిమితం చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ద్వారా రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో తొలి దశలో 22 కిలోమీటర్ల మేర ఈబీఆర్టీఎస్ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా భూసేకరణ, ప్రాజెక్టు డిజైన్లు, రూట్ మ్యాప్, మెట్రో అనుసంధానం వంటి అంశాలతో పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రణాళికలను పక్కనపెట్టేలా.. మెట్రో విస్తరణ పేరిట ఫోర్త్ సిటీకి మళ్లించింది.
నగరానికి సుదూరంగా, గతంలో ఫార్మా సిటీ నిర్మాణానికి ప్రతిపాదించిన ముచ్చెర్లను ఆనుకుని ఫోర్త్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టింది. కాగితాలకే పరిమితమైన ఈ ప్రాంతానికి రెండో దశలోనే మెట్రో విస్తరిస్తామని హామీ ఇచ్చింది. ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి చేరుకునేలా ఎలివేటెడ్ మెట్రోతో డిజైన్లు ఖరారు చేసింది. కానీ ఎప్పుడో ప్రతిపాదించిన ఈబీఆర్టీఎస్ను పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి కదలికలు లేవు. ఈబీఆర్టీఎస్పై హెచ్ఎండీఏ చేసిన అధ్యయనాలను కూడా పరిశీలించకుండానే… మెట్రో విస్తరణ పేరిట ప్రాజెక్టుకు మంగళం పాడేశారు. భవిష్యత్‌లో కూడా మెట్రో రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లో ఈబీఆర్టీఎస్ వచ్చే అవకాశం లేదని తెలిసింది.