సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతంలోని షాబాద్ సెక్షన్లో అసిస్టెంట్ లైన్మెన్కు సహాయకుడిగా ఒక మైనర్‌ను పెట్టుకుని పనులు చేయించే క్రమంలో ఆ బాలుడు కరెంట్ షాక్‌తో చనిపోయారు. దీంతో అసిస్టెంట్ లైన్మెన్ను అక్కడి డీఈ సస్పెండ్ చేశారు. షాపూర్‌నగర్ సెక్షన్లో ఒక ఆర్టిజన్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కొంతకాలంగా విధులకు రావడం లేదు. ఈయన స్థానంలో మరోవ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ విషయం అధికారులకు తెలిసే జరుగుతోంది. మేడ్చల్ సర్కిల్లోని ఓ సెక్షన్లో ఒక ఆర్టిజన్ వద్ద ఐదారుగురు సహాయకులు పనిచేస్తున్నారు. నిజానికి వీరికి విద్యుత్ సంస్థతో సంబంధం లేదు.
మరి జీతాలు ఎలా అంటే వినియోగదారుల నుంచి వసూలు చేసి న సొమ్ముల నుం చి ఇస్తారు. మరి ఆర్టిజన్ ఏం చేస్తారంటే నేతలతో తిరుగుతూ, పైరవీలు చేస్తూ దందాలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా యి. గతంలో ఒకసారి మందలించినా మళ్లీ అదే రీతిలో తన సహాయకులను పెట్టుకుని పై స్థాయి అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు దక్షిణ డిస్కంలో చెప్పుకుంటారు. గత ఏడాది పాతబస్తీలో ఒక సహాయకుడు స్తంభంపైనే పనిచేస్తూ చనిపోయాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నగరంలోని పది సర్కిళ్లలో క్షేత్రస్థాయిలో వేర్వేరు సెక్షన్లలో సహాయకులతో పనిచేయించే దందాను సిబ్బంది ఆపడం లేదు.
కొందరు ఏఎల్ఎంలు, లైన్మెన్ల తీరు చూసి ఆర్టిజన్లు సైతం ఇదే బాట పడుతున్నారు. వయసు రీత్యా స్తంభాలు ఎక్కలేని పరిస్థితుల్లో తమకు సహాయకులుగా కొందరిని పెట్టుకోవడంతో వారే మొత్తం పనులు చేసి పెడ్తున్నారని కొన్ని రోజుల క్రితం వరకు డిస్కంలో ఒక్క సీఎండీ జితేశ్ పాటిల్‌కి మినహా అందరికీ తెలిసిన విషయమేనంటూ మింట్ కాంపౌండ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇటీవల సైబర్‌సిటీ సర్కిల్లోని షాబాద్‌లో జరిగిన సంఘటన తర్వాత సీఎండీ అన్ని సర్కిళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ గట్టిగా చెప్పారు. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మొదట కొన్నిరోజులు తమకు సహాయకులుగా ఉన్నవారిని కనిపించకుండా జాగ్రత్త పడ్డ కొందరు ఏఎల్ఎంలు, ఎల్‌ఎంలు,ఎల్ఐలు, ఆర్టిజన్లు వర్షాకాలంలో పనులు చేయాల్సి రావడంతో ఏం చేయాలో పాలుపోక మళ్లీ వారినే పెట్టుకుని పనులు చేస్తున్నట్లు తెలిసింది.
అనధికారికంగా జరుగుతున్నా..
క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ వ్యవహారం కార్పొరేట్ ఆఫీసులోని ఉన్నతాధికారులు మొదలు ఏఈవరకు అందరికీ తెలుసు అయినా వారేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే తమకు వచ్చే ఫిర్యాదులు, సాంకేతిక సమస్యలు పరిష్కరించాలంటే సిబ్బంది కావాలి. తక్కువ సిబ్బంది ఉండడంతో ఉన్నవారిని పనిచేయించలేక, బయటవారిని వద్దనలేక స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఒక సీనియర్ ఇంజినీర్ చెప్పారు. ఎక్కడైనా సమస్య వస్తే ఆ పని చేస్తున్నది బయటవారా.. తమ వారా అనేది ఆరా తీయడమే తప్ప మిగతా సమయాల్లో ఎవరు పనిచేస్తున్నారనేది చూడకుండా పని జరిగిందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారంటూ దక్షిణ డిస్కంలో ఒక అధికారి చెప్పారు.
సెక్షన్ల పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది తమకు బదులుగా పెట్టుకున్న సహాయకుల్లో ఎవరైనా చనిపోయినా, ఏదైనా తీవ్రగాయాలైనా ఆ విషయం తెలిసి ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడమో లేక మెమోలు ఇవ్వడమో చేస్తున్నారు తప్ప సిబ్బందిని పెంచే విషయంలో కానీ, సహాయకులుగా వస్తున్న వారికి కావాల్సిన భద్రతా చర్యలు కల్పించడంలో కానీ విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా సహాయకులుగా వస్తున్నవారికి సిబ్బంది పెద్ద ఎత్తున ఆశలు కల్పిస్తూ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం ఇప్పిస్తామని, తమ పై అధికారులు కూడా అందుకు ఒప్పుకున్నారంటూ అవసరమైతే వారితో కూడా చెప్పించి నమ్మిస్తున్నారని తెలిసింది. దీంతో వారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయకులుగా పనిచేస్తున్నారు.
సిబ్బంది కొరతే కారణం
నగరంలో విద్యుత్ నెట్వర్క్ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో అందుకు తగినట్లుగా సిబ్బంది లేకపోవడమే బయటవారిని సహాయకులుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదని కార్పొరేట్ కార్యాలయంలోని ఒక డైరెక్టర్ చెప్పారు. ఒక్కో సెక్షన్ లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, ఆర్టిజన్లు కలిపి 15 మంది వరకు ఉంటారు. ఇందులో పనిచేసే వాళ్లు సగం కూడా ఉండరు. మిగతావారు తమ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ , కొత్త కనెక్షన్ల జారీ, ఇళ్లకు దగ్గరలో ఉన్న స్తంభాలు మార్చడం, డీటీఆర్‌ల కేటాయింపుల వంటి పైరవీలు చేస్తూ స్తంభాలపై పనులకు సహాయకులను వాడుతున్నారు. నగరంలో నెట్‌వర్క్‌కు తగినట్లుగా క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరు.
అందునా స్తంభాలు ఎక్కే వయసులో ఉన్న వారు మరీ కరువై పోయిన పరిస్థితి ఉంది. సిటీలో వందకు పైగానే జూనియర్ లైన్మెన్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదు. కొత్తగా ఆర్టిజన్లను తీసుకోవడం లేదు. సంవత్సరాల తరబడి ఒకేచోట పనిచేయడం వల్ల ఎల్‌ఎంలు, ఆర్టిజన్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మయసు మళ్లిన వారిని క్షేత్రస్థాయి పోస్టుల నుంచి కార్యాలయాల్లో పోస్టులకు పంపించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తే ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడానికి అవకాశముంటుందని ఆ డైరెక్టర్ చెప్పారు.