సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): విద్యుత్ ప్రమాదాల నివారణలో నిరంతరం అప్రమత్తతే చాలా కీలకమని, యంత్రాలు, ఇతర పరికరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించడం విద్యుత్ నిపుణుడి ప్రాథమిక కర్తవ్యమని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ అన్నారు. రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) భవనంలోని కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) వై.లింగారెడ్డి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ ప్రతినిధి కేవీ రావులతో పాటు పలువురు విద్యుత్ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రమాదాల నివారణపై తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖ ఉద్యోగుల సంఘం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను సునీల్ శర్మ ఆవిష్కరించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సరఫరాలో విద్యుత్ వైర్లు, ఇతర పరికరాలు ఎంతో నాణ్యత కలిగినవై ఉండాలని, ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ప్రకారమే తయారైన వాటినే ఎలక్ట్రికల్ నిపుణులు వినియోగించాలి. ఇంట్లో, పరిశ్రమలు, మరెక్కడైనా విద్యుత్‌ను వినియోగిస్తున్నప్పుడు నిపుణులు విద్యుత్ సరఫరా ఎలా ఉంది..? పూర్తి ఆగిపోతుందా? లేదా వంటి విషయాలను తరచూ తనిఖీ చేసుకోవాలని సూచించారు.టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తోంది. సరఫరా ఎలాంటి లోపం లేకపోయినా, ఎలక్ట్రిషియన్ వంటి నిపుణులు చేసే నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి, విద్యుత్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస రావుతో పాటు పలువురు విద్యుత్ రంగ సంస్థ నిపుణులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే నిపుణులు పాల్గొన్నారు.