సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : మియాపూర్‌లోని 220కేవీ ఈహెచ్‌టీ సబ్ స్టేషన్లో అనుమానాస్పదంగా విద్యుత్ కేబుల్స్ కాలిపోయాయి. అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ సర్యూట్ ద్వారా సరఫరాను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంతో ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా అయ్యే కైత్లాపూర్, మియాపూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో సుమారు గంటకు పైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నగరంలో అత్యధిక డిమాండ్ 4350 మెగావాట్లకు పైగా ఉన్నప్పుడు ఈ కేబుల్స్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఆదివారం ఉదయం సమయంలో డిమాండ్ అతి తక్కువగా ఉన్నప్పుడు ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ ఎస్ఏఎం రిజ్వీ పోలీసు విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, టీఎస్ ట్రాన్స్‌కో డైరెక్టర్ ట్రాన్స్మిషన్ జగత్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీ వినిత్, విద్యుత్ శాఖ అధికారులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
కాగా మియాపూర్ మెట్రో డిపో పక్కన ఉన్న సబ్ స్టేషన్లోకి బయట నుంచి ఇతరులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పలువురు తెలిపారు. అదేవిధంగా 220, 33 కేవీ లైన్లు పక్క పక్కనే ఉండడం, వాటికి ఉండే జాయింట్ల వద్ద లోడ్ పెరిగినప్పుడు షాక్ సర్కూట్ వచ్చి కాలిపోయే ప్రమాదం ఉంటుందని విద్యుత్ నిపుణులు తెలిపారు. ఈ సంఘటనపై విద్యుత్ శాఖ అధికారులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.