దుండిగల్, సెప్టెంబర్ 28 : చార్జింగ్ ఓవర్‌లోడ్ అయి ఎలక్ట్రిల్ బైక్ పేలి..మంటలు ఎగిసిపడి మెడికల్ షాప్ దగ్ధమైంది. ఈ సంఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూరారం చౌరస్తా నుంచి విలేజ్‌కి వెళ్లే దారిలో ఆదిత్యమెడికల్ షాప్‌ను కోళ శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు నిర్వహిస్తున్నారు.
అయితే హోండెలివరీ కోసం ఎలక్ట్రిక్ బైక్‌ను వాడుతున్నారు. షాపు ముందు బైక్‌కు చార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా చార్జింగ్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. షాపుముందే ప్రమాదం జరగడంతో మంటలు మెడికల్షాపులోకి ఎగిసిపడి.. షాపులో ఉన్న మందులు, ఫర్నిచర్, ఏసీలు, ఫ్రిజ్, వంటి పరికరాలు దగ్ధమయ్యా యి. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.