సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : ఏ బండికి లేని నిబంధనలు ఆటోలపై విధించడం సరైనది కాదని ఆటోడ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం ఆటోపై ఆధారపడే సామాన్యులపై సర్కార్ పర్మిట్ నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు. ఆటో పర్మిట్లను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈవీ వాహనాలను కొనుగోలు చేయాలని కేంద్రం ప్రభుత్వం సైతం మార్గదర్శకాలు జారీచేసింది.
పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం తగ్గించాలని పేర్కొంది. ఇలాంటి తరుణంలో రేవంత్ ప్రభుత్వం సైతం ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తామని పేర్కొంది. కానీ ఓవైపు కాలుష్య కట్టడి చేస్తామని చెబుతునే మరోవైపు 10వేల ఎల్పీజీ, 10వేల సీఎన్జీ ఆటోల కొనుగోలుకు ఇటీవల 263 జీవో జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జీవోలో 20వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతినిచ్చింది. మొత్తం ఈవీ ఆటోలకే అనుమతి ఇస్తే బాగుండేదని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. మరోవైపు తాజాగా ఆర్టీఏ అధికారులు కొన్ని ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు ఓఆర్ఆర్ పరిధి వరకు పర్మిట్లు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్మిట్లను ఎత్తివేయాలని కోర్టులో సైతం కొందరు ఆటో డ్రైవర్లు న్యాయ పోరాటం చేస్తున్నారు. దీంతో పర్మిట్ల ఎత్తివేసే అంశంపై రవాణా శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
బ్లాక్ మార్కెట్ దందాకు తెర!
కొత్తగా ఆటో కొనుగోలు చేయాలనుకునే వారికి స్క్రాప్ నిబంధన ఇబ్బందిగా ఉండేది. పాత ఆటోను కొనుగోలు చేసి.. ఆ ఆటోను స్క్రాప్నకు పంపించి ఆ స్థానంలో కొత్త ఆటో బతుకు బండిపై ఆంక్షలు! కొనుగోలు చేయాల్సి వచ్చేది. దీంతో బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగుతోంది. కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారిపై అదనంగా రూ.2 లక్షల భారం పడుతుంది. పాత ఆటో లేనివారు ఆటో కొత్తగా కొనుగోలు చేసే అవకాశం లేదు. అందులోనూ ఎలక్ట్రిక్ ఆటోను కూడా ప్రభుత్వం జారీ చేసిన 20వేల ఆటోలలో మాత్రమే కొనుగోలు చేయాలి. ఆ ఆటోలకు కూడా పర్మిట్(ఎక్కడి వరకు వెళ్లాలి)లు జారీ చేస్తారు. ఆ ఆటోలు పూర్తయితే మళ్లీ కొత్త ఈవీ ఆటో కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఈ విధానంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయడంపై ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని.. ఆటోనే ఉపాదిగా భావించే వారు ఎవ్వరైన కొనుగోలు చేసుకునేల ప్రభుత్వం అనుమతినివ్వాలని కోరుతున్నారు.
స్క్రాప్ స్థానంలో కొత్త ఈవీ..
ప్రతి రోజు గడువు ముగిసిన ఆటోను రవాణా శాఖ నిబంధనల ప్రకారం స్క్రాప్ చేస్తారు. ఈ సమయంలో ఆర్టీఏ ఓ నంబర్ కేటాయించి అదే స్థానంలో మరో కొత్త సీఎన్జీ, ఎల్పీజీ (గతంలో అది ఏ ఆటో అయితే అది) ఆటో కొనుగోలుకు అనుమతిస్తారు. ఇకపై ఆ నిబంధన మారనుంది. ఆటో ఏదైనా స్క్రాప్నకు వెళితే ఆ ఆటో స్థానంలో కొత్త ఈవీ ఆటోను కొనుగోలు చేసేల నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే నగరంలో 1.10లక్షల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలు ఉన్నాయి. వీటి స్థానంలో పాత నిబంధనల ప్రకారం మళ్లీ అవే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆటోలనే కేటాయిస్తే కాలుష్య నియంత్రణ సాధ్యం కాదని పర్యావరణ వేత్తలు సైతం ప్రభుత్వానికి లేఖలు రాశారు. మొత్తం ఈవీ ఆటోలనే కేటాయించాలని సూచించారు. ఇలా స్క్రాప్నకు వచ్చే ఆటోల స్థానంలో ఈవీ ఆటోలు రావాలని పేర్కొన్నారు. దీంతో ఇకపై అన్నీ ఈవీ ఆటోలే నగరంలో కనిపించనున్నాయి.