సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమన్నారు. ఆయా పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్లను సమాయత్తం చేసి, ఈ సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడాలని సూచించారు.
అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి, సమర్పించేలా ఏజెంట్లు క్షేత్రస్థాయిలో సహాయం అందించాలని, తద్వారా ఈ సవరణ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. కాగా సర్ అమలు ప్రక్రియపై రాజకీయ పార్టీల నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్యూమరేటర్ల పనితీరు బాగా లేదని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) సంతోష్ కుమార్, జోనల్ కమిషనర్ కె.చంద్రకళ, బీఎస్పీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, ఏఐఎంఐఎం ప్రతినిధులు పాల్గొన్నారు.