మారేడ్‌పల్లి, నవంబర్ 26: సంక్షేమ ప్రభుత్వాన్నే ప్రజలందరూ కోరుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ఐదవ వార్డులోని వాల్మికినగర్, గాంధీ గార్డెన్, దుర్గయ్య గార్డెన్, సంజీవయ్య వీకర్ సెక్షన్, సెకండ్ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి జి.లాస్యనందితకు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, ఎంఎన్. శ్రీనివాస్, కట్టెల శ్రీనివాస్ యాదవ్‌లు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థి జి.లాస్యనందితకు, మంత్రి తలసానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ…అన్ని వర్గాల ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారన్నారు. గతంలో కంటోన్మెంట్లో నీటి సమస్య తీవ్రంగా ఉండేదని, దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న చొరవతో నీటి సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించారని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ అభ్యర్థి జి. లాస్యనందితకు భారీ మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పాదయాత్రలో వాల్మీకి సమాజ్ ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెద్దాల నర్సింహ, కిరణ్, పెంటా శ్రీహరి, ముప్పిడి గోపాల్, తేలుకుంట సతీశ్ గుప్తా, అరుణ్‌జ్యోతి, భాస్కర్, నారాయణ, రేపాల వెంకటేశ్వర్లు, వికాస్ మంచ్ ప్రతినిధులు సంకి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి జి.లాస్యనందితకు ఐదవ వార్డులోని ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పాలక మండలి సభ్యుడు చొల్లేటి రమేశ్ ఆధ్వర్యంలో కాలని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ముర్కి చంద్రకాంత్, రావికంటి శ్రీనివాస్, కరుమూరి రాధకృష్ణ, ఉప్పలంచి శ్రీనివాస్‌లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు.