హైదరాబాద్: ప్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ (Sahiti Infra) డైరెక్టర్ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకున్నది. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. రూ.1800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్‌పై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇదే వ్యవహారంలో గతంలోనూ ఆయనను పోలీసులు అరెస్టు చేసింది. ప్రీలాంచ్ పేరుతు 2500 మంది కస్టమర్ల నుంచి పెద్దమొత్తంలు డబ్బులు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగస్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై హైదరాబాద్ సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 2న ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు.