నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): సాహితీ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీపై శుక్రవారం ఈడీ కోర్టులో వాదనలు ముగిశాయి. సీసీఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారని, దర్యాప్తు నేపథ్యంలో రూ.200 కోట్ల సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను కూడా జప్తు చేశారని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రూ.1500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణను సైతం అధికారులు పూర్తి చేశారన్నారు.
ప్రస్తుతం ఈడీ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని, సంబంధిత ధ్రువపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. కోట్లల్లో మోసం జరగడంతో ఈడీ రంగంలోకి దిగిందని, డబ్బులకు సంబంధించిన మోసాల గురించి మాత్రమే ఈడీ విచారణ చేపడుతుందని ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. రూ.1500 కోట్ల వసూళ్ల గురించి జరిగిన మోసాన్ని విచారించేందుకు ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. డబ్బుల లావాదేవీల గురించి మాత్రమే ఈడీ విచారిస్తుందన్నారు. దాదాపు 3000 మంది బాధితులు మోసపోయారని, ఇప్పటికే ఈ సంస్థపై 50కి పైగా కేసులు నమోదయ్యాయని నిందితుడి తరఫు న్యాయవాది వివరించినప్పటికీ ఆ కేసులతో ఈడీకి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది.
లావాదేవీల్లో పాల్గొన్న ఇతర డైరెక్టర్లతో పాటు చేతులు మారిన కీలక వ్యక్తుల వివరాలను సేకరించాల్సి ఉన్నదని ఈడీ తెలిపింది. ఈడీ కార్యాలయంలో చేపట్టిన విచారణకు నిందితుడు పూర్తి స్థాయిలో సహకరించలేదన్నారు. సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల, కీలక పత్రాల గురించి నిందితుడి ద్వారా వివరాలను తెలుసుకోవాల్సి ఉన్నదన్నారు. నిందితుడి నుంచి సమాచార సేకరణకు 14 రోజుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించాలని న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాలకు చెందిన వాదనలు విన్న కోర్టు.. తీర్పును 7కు రిజర్వ్ చేస్తూ జడ్జి సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరయ్యారు.