శంషాబాద్ రూరల్, జూన్ 4: శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉండటం కలకలం రేపింది. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ హైమ్మద్ వైద్య చికిత్స కోసం ఎయిర్పోర్టుకు చేరుకోగా, అతడికి గతంలో ఎబోలా సోకిన చరిత్ర ఉన్నట్లు విమానాశ్రయ స్క్రీనింగ్ అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయ వర్గాలతో పాటు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది.
చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు వచ్చిన అతడు.. సుడాన్ దేశం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అతడి మెడికల్ రికార్డులను అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల ప్రకారం హెల్త్ డెస్క్ అధికారులు క్షుణంగా పరిశీలించారు. తనిఖీల్లో అతడికి గతంలో ఎబోలా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ముందుజాగ్రత్తగా అతడిని అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలోని ఐసోలేషన్ గదికి తరలించారు.