హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేయడం దారుణం. నగరంలో బయో డైవర్సిటీకి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిలుస్తున్నది. అక్కడ నెమళ్లు, లేళ్లు, కుందేళ్లు ఏ సమయంలోనైనా కనిపిస్తుంటాయి. ఆ 400 ఎకరాలు రియల్ ఎస్టేట్ మాఫియా కు కట్టబెడితే అక్కడి పర్యావరణ సంపద మొత్తం కనుమరుగైపోయే ప్రమాదముంది. ప్రాథమికంగా విద్యాసంస్థలకు కేటాయించిన భూమిని ప్రభుత్వాలు తిరిగి తీసుకోవడం సరికాదు. భావితరాలకు విద్యావ్యవస్థతో పాటు పరిశోధనలను అందించే సంస్థలను నీరుగార్చడం సరికాదు.
గతంలో ప్రభుత్వాలు అన్ని ఆలోచించి ఉన్నత విద్యా సంస్థలకు భూ కేటాయింపుల చేశాయి. దానిని తిరగతోడి, ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ రంగానికి కట్ట పెట్టాలనుకోవడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి వర్సిటీ భూముల అమ్మకాన్ని నిలిపివేయాలి. అభివృద్ధే చేయాలంటే ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో భూములు సేకరించాలి. దేశాన్ని కొల్లగొట్టాలంటే విద్యా సంస్థలను మూసివేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయడం దారుణం. పర్యావరణ సమతుల్యంతో మానవజాతి వినాశనానికి మార్గాలు ఏర్పడుతాయి. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి భూములు లాక్కొనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి.