శేరిలింగంపల్లి, ఆగస్టు 14: ఓ వైపు చుట్టూ ఎత్తైన కొండలు.. మరో వైపు రంగురంగుల అద్దాల బహుళ జాతి సంస్థల భవనాల మధ్య ప్రకృతి అందాలను కనువిందు చేసే ఆహ్లాదకర వాతావరణంలో త్రివర్ణ రంగులతో సెయిలింగ్ పడవల ప్రత్యేక విన్యాసాలు శనివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదాపూర్‌లోని దుర్గం చెరవులో చిన్నారుల ప్రదర్శించిన సెయిలింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.యాక్ట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వైసీహెచ్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఈ విన్యాసాలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 20 మంది చిన్నారులు తమ అద్భుత ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ విన్యాసాలను తిలకించారు. సెయిలింగ్ విన్యాసాలు ప్రదర్శించిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు.
చిన్నతనం నుంచి ఎంతో ధైర్యసాహసాలతో ఈ సెయిలింగ్ ప్రతిభను కనబరిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు సెయిలింగ్ విన్యాసాలకు నగరంలో కేవలం హుస్సేన్ సాగర్ మాత్రమే అందుబాటులో ఉండేదని సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో మాదాపూర్ దుర్గం చెరువులో సెయిలింగ్ క్రీడా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. యాక్ట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు సుహీం షేక్, ఉపాధ్యక్షుడు దాది బోడే, రాష్ట్ర సెయిలింగ్ అసోసియేషన్ సలహాదారులు కేఎస్ రావుతో పాటు నగరంలోని రసూల్‌పూర ఉద్భవ పాఠశాల, గౌతమ్ మోడల్ స్కూల్‌కు చెందిన 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.