మేడ్చల్ / సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా శాశ్వత చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు రాగా, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ంఎసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి అర్వింద్ కుమార్ డంపింగ్ యార్డును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డుతో స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
డంపింగ్ యార్డులో 28 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని (రెండో యూనిట్) ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నవంబర్‌లో క్లియరెన్స్ వస్తుందని, అనుమతులు వచ్చిన 18 నెలల్లో పనులు పూర్తి చేయిస్తామన్నారు. డంపింగ్ యార్డులో ఇప్పటికే ఉన్న 20 మెగా వాట్ల ఉత్పత్తి కేంద్రంతో పాటు రెండో యూనిట్లో 28 మెగా వాట్లతో కలిపి మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందన్నారు. ఇందుకోసం 7 వేల టన్నుల చెత్త అవసరం ఉంటుందని, నగరం నుంచి ప్రతిరోజు వచ్చే 7 వేల 4 వందల టన్నుల చెత్తను నిల్వ ఉంచకుండా నేరుగా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించడంతో దుర్వాసన రాకుండా ఉంటుందన్నారు. దీంతో శాశ్వత పరిష్కారం లభించడం ఖాయమన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు అర్వింద్ కుమార్ తెలిపారు.
డంపింగ్ యార్డు సమీపంలోని కలుషితమైన చెరువులను శుద్ధి చేసేందుకు రూ.230 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. 8 చెరువులు కలుషితమైనట్లు గుర్తించామని.. త్వరలో అందులోని నీటిని శుద్ధి చేసి సుందరీకరిస్తామన్నారు. రూ.146 కోట్ల నిధులతో చెత్త కుప్పల క్యాపింగ్ చేసి సీఎన్జీ, సీపీజీ గ్యాస్ తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దుండిగల్‌లో చెత్త ద్వారా 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి పనులు జరుగుతున్నాయని, 2022 జూన్ నాటికి పనులు పూర్తి అవుతాయన్నారు.
డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా తక్షణ చర్యల్లో భాగంగా నేటి నుంచి డ్రోన్ల సహాయంతో రసాయనాలు పిచికారీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. దుర్వాసన రాకుండా రాంకీ గ్రూప్ ఉద్యోగులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
నగరంలో నాలుగు వైపులా డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తిస్తున్నట్లు అర్వింద్ కుమార్ వివరించారు. ఇప్పటికే లక్డారం ప్రాంతంలో 120 ఎకరాలు, గ్యారీనగర్లో 150 ఎకరాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. మరికొన్ని చోట్ల స్థలాలు గుర్తించాల్సి ఉందన్నారు. అధికారులు, రాంకీ గ్రూప్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, డంపింగ్ యార్డులో అర్వింద్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్‌కుమార్ మొక్కలు నాటారు. డంపింగ్ యార్డులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, బయోగ్యాస్, చెత్త ద్వారా తయారయ్యే ఎరువులను మేయర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ లోకేశ్ కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని, రాంకి గ్రూప్ నిర్వాహకులకు తగు సూచనలు చేశాం. అందుకు వారం రోజుల గడువు ఇచ్చాము, వారం తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించాం. 15 రోజులలో చేపట్టిన చర్యలను మరోసారి పరిశీలిస్తాం. డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. వారికి అందుబాటులో ఉంటాం. స్థానికులు ఇక్కడి సమస్యలను మా దృష్టికి తీసుకరావడంతో యార్డును సందర్శించాం. – గద్వాల విజయలక్ష్మి, నగర మేయర్