సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో కొందరు అధికారులకు బంధుప్రీతి, సన్నిహితులపై ప్రేమ ఎక్కువవడంతో వినియోగదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. తమవారికే పనులు ఇప్పించుకునే క్రమంలో వేరే ఎవరైనా అక్కడ పనులు చేస్తే వారికి అడ్డుకట్ట వేయడానికి కొందరు ఇంజినీర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ప్రధానంగా ఈ పరిస్థితి డిస్కంలో అప్లికేషన్ పెట్టుకున్న దగ్గరి నుంచి స్టోర్స్‌లో మెటీరియల్ విడుదలతో సహా మీటర్ కనెక్షన్ ఇచ్చే వరకు అడుగడుగునా కొందరు ఇంజినీర్లు తమవారికి పనిదక్కకపోతే ఆ ప నులు చేయించుకోవాల్సిన వినియోగదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.
తన తమ్ముడికి పని దక్కలేదని..!
నగరంలోని ఓ సర్కిల్లో వినియోగదారుడు తనకు కనెక్షన్ కావాలంటూ మూడు నెలల కిందట దరఖాస్తు చేసి ఎస్పీడీసీఎల్ అధికారులు ఇచ్చిన ఎస్టిమేషన్ను బట్టి రూ.9లక్షలు చెల్లించారు. అయితే ఆన్లైన్ దరఖాస్తు తర్వాత డబ్బులు కట్టే సమయంలో ఇచ్చిన రసీదులోనే కనెక్షన్ ఇచ్చే సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. కానీ అధికారులు మాత్రం సంబంధిత భవనానికి డీటీఆర్ ఇవ్వడానికి ఓసీ కావాలంటూ తిరకాసు పెట్టి గత కొన్నిరోజులుగా తిప్పించుకున్నారు.
తీరా దీనికి కారణమేంటని ఆరా తీస్తే సదరు సర్కిల్ పెద్ద ఇంజినీర్ తమ్ముడు అక్కడ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు తన సర్కిల్లో జరిగే వర్క్ రాకుండా వేరే ఎవరూ చేయవద్దని ఇందుకోసం ఏదో ఒక తిరకాసు పెడ్తూ చివరకు ఆపని ఒప్పుకున్న వ్యక్తి వదిలేసి పోతే తన తమ్ముడికే ఆ పని దక్కుతుందని ఆ అధికారి భావించారు. ఇందుకోసం తన దగ్గర ఉన్న మరో ఇంజినీరుతో కలిసి ఆ వినియోగదారుడిని నానా తిప్పలు పెట్టారు. సీఎండీ ఓసీ లేకుండా మెటీరియల్ ఇవ్వొద్దని తమకు మీటింగ్‌లోనే చెప్పారంటూ దబాయించారు. ఈ విషయంలో చాలా పెద్ద రచ్చే జరిగింది. ఆనోటా ఈనోటా ఇది పెద్ద సార్ దగ్గరకు చేరడంతో ఆయన రూల్స్ ఎలా బ్రేక్ చేస్తారంటూ చివాట్లు పెట్టి ప్రస్తుతం సమస్య సద్దుమణిగేలా చూశారని డిస్కంలో చర్చ జరుగుతోంది. ఇది ఒక అధికారి బంధుప్రీతికి ఉదాహరణ.
కొత్త అధికారులకు పాతవారి సిఫారసులు..
ఈ బాగోతం ఇలా ఉంటే ఇటీవల ఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఇందులో బదిలీపై మరోచోటకు వెళ్లిన వారు, ప్రమోషన్లు పొందినవారు తమ పాతస్థానాలపై ప్రేమ చంపుకోలేకపోతున్నారట. తమ వారికే పనులు దక్కేలా చూడాలంటూ కొత్తగా వచ్చిన వారికి కొందరు పాత అధికారులు సిఫారసులు చేస్తున్నారంటూ డిస్కంలో చర్చ జరుగుతోంది. ఆయన మనవాడే.. మిమ్మల్ని చూసుకుంటాడంటూ ఆ అధికారులకు ఆఫర్ ఇస్తున్నారని మింట్ కాంపౌండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ బంధువులు, సన్నిహితులతో బినామీ పనులు చేయిస్తున్న కొందరు అధికారులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ మొత్తంలో పనులు దక్కించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు సొంతంగా చేసుకోవడానికి ఇబ్బంది పడేలా అప్లికేషన్లే ఉండగా.. వాటిని దాటుకుని తమకు తెలిసిన కాంట్రాక్టర్‌తో పనిచేయించుకుంటామంటే మళ్లీ అక్కడ కూడా క్షేత్రస్థాయి అధికారులనుంచి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. తమ వారికి దక్కకపోతే ఆ ఫైల్ మూలనపడ్డట్టే. డిస్కంకు కట్టాల్సిన డబ్బులు కట్టించి చివరకు కావాల్సిన మెటీరియల్ ఇచ్చే దగ్గరి నుంచి అసలు సమస్య సృష్టిస్తున్నారంటూ కొన్ని సర్కిళ్లలో ఉద్యోగులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారమంతా సీఎండీ ముషారఫ్ ఫరూఖీ దృష్టికి తీసుకుపోవడంలో వినియోగదారులకు అవకాశం లేక ఫిర్యాదుల రూపంలో ఇవ్వాలని ప్రయత్నించినా.. అది సాధ్యపడడం లేదని, సీఎండీ కనీసం వారంలో ఒక్కరోజైనా వినియోగదారులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటే ఇటువంటి బినామీ దందాకు చెక్ పెట్టవచ్చని వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.