అంతకుముందే ఓ కుటుంబంపై కత్తితో దాడి
పెట్రోల్‌బంకు సిబ్బందిపైనా దాడి
నిందితుడిపై 8 పోలీస్ స్టేషన్లలో 13 కేసులు
సికింద్రాబాద్, జూన్ 6 : మద్యం మత్తులో ఓ కుటుంబంపై హత్యాయత్నం చేయడమే కాకుండా పోలీసులపైనే దుర్భాషలాడుతూ కొట్టేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా పోలీసులే తనను గాయపర్చారని నిందితుడు ఆరోపణలు గుప్పిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడకు చెందిన సూర్య ఆరోక్యరాజ్(27) జిమ్ కోచ్. ఈనెల 3న సాయంత్రం 6.30 గంటలకు మెట్టుగూడకు చెందిన ఏసుదాసు కుటుంబంపై మద్యం మత్తులో ఆరోక్యరాజ్ కత్తి, కర్రలతో దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఏసుదాసు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ కార్ సిబ్బంది సర్దిచెప్పి ఆరోక్యరాజ్ను అక్కడి నుంచి పంపించారు. అదే రోజు రాత్రి సమీపంలోని ఓ పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోయించుకుని అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి రాత్రి 10.30 గంటల సమయంలో మరోమారు ఏసుదాసు కుటుంబంపై దాడికి పాల్పడి ద్విచక్ర వాహనం, విద్యుత్మీటరు ధ్వంసం చేశాడు. దీంతో మరోమారు డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఏసుదాసు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఆరోక్యరాజ్ను అదుపు చేసేందుకు యత్నించినా సాధ్యం కాకపోవడంతో మరో పెట్రోలింగ్ కారుకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న నలుగురు పోలీసులు ఆరోక్యరాజ్ను అదుపు చేసేందుకు, అతడి చేతిలోని కర్రను, కత్తిని తీసుకునేందుకు యత్నించారు. కానీ ఆరోక్యరాజ్ పోలీసులపైనే దాడికి యత్నించడంతో పాటు దుర్భాషలాడాడు. ఈ పెనుగులాటలో నిందితుడు ఆరోక్యరాజ్ కాలుకు గాయమైంది.
పెనుగులాట జరుగుతున్న తరుణంలో కావాలనే నిందితుడికి మద్దతుగా ఉన్న కొందరితో వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోను కావాలనే పోలీసులు కర్ర గుంజుకునే యత్నంలో అతడి కాలుపై తన్నే దృశ్యాలను మాత్రమే ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయించాడు. ఎక్కడా నిందితుడు పోలీసులపై దాడికి యత్నించిన వీడియో కనిపించకుండా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించాడు. ఆరోక్యరాజ్పై నగరంలోని ఎనిమిది పోలీస్ స్టేషన్లలో 13 కేసులు, భార్యను కట్నం కోసం వేధించాడు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదుకాగా జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. ఇదిలా ఉండగా నిందితుడి తల్లి శీల కూడా గతంలో పొరుగింటి వారితో తన కొడుకుకు ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో కాలు విరిగినట్లు చెప్పినట్లు స్థానికులే చెబుతుండటం విశేషం. గతంలోనే కాలుకు ఫ్యాక్చర్ అయిన నేపథ్యంలో ప్రస్తుత పెనుగులాటతో గాయం తీవ్రమైనట్లు సమాచారం.
పోలీసులపైనే దాడికి యత్నం
స్థానికులపై దాడి చేయడం, చేతిలో కర్ర, కూరగాయల కత్తి పట్టుకుని స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడన్న సమాచారంతోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లారు. కానీ నిందితుడు ఆరోక్యరాజ్ మద్యం మత్తులో ఉగిసలాడుతూ పోలీసులపైకే దాడికి యత్నించాడు. నిందితుడి చేతిలోని కర్రను, కత్తిని స్వాధీనం చేసుకోవడానికి యత్నించిన సమయంలోనే నిందితుడికి సంబంధించిన పలువురు వీడియో తీసినట్లు తెలుస్తున్నది. వీడియోలో కేవలం పోలీసులు నిందితుడి నుంచి చేతి కర్ర, కత్తిని గుంజుకోవడానికి యత్నించడంలో మాత్రమే నిందితుడిని అదిమిపట్టుకోవడం జరిగింది. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తన కుమారుడి కాలు విరిగిందని నిందితుడి తల్లి స్థానికులకు చెప్పినట్లు సమాచారం ఉంది. కావాలనే నిందితుడు పోలీసులపై దుష్ప్రచారానికి ఒడిగట్టాడు.
– జి. నరేశ్, సీఐ, చిలకలగూడ పోలీస్ స్టేషన్