సిటీబ్యూరో, జనవరి 4(నమస్తే తెలంగాణ): మద్యం ప్రియులకు శని, ఆదివారాలంటే పండుగే. కానీ ఈ రెండురోజుల్లోనే పోలీసులు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కొందరు పోలీసులు చెప్పినట్లుగా చేసి వెళ్లిపోవడం, పట్టుబడితే ఫైన్ కట్టడం చేస్తుంటే మరికొందరు మాత్రం నానారచ్చ చేస్తున్నారు. ఇంకొందరైతే మద్యం మత్తులో ఏకంగా పోలీసులపైనే దాడులకు దిగుతున్నారు.
మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మందుబాబులకు కిక్కిస్తే, పోలీసులకు మాత్రం చుక్కలు చూపించిందని ఓ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. తప్పతాగిన చాలా మంది పలు ప్రాంతాల్లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు తమ తలతామే కొట్టుకుంటూ, రోడ్లపై పడుకుంటూ, పోలీసులను నెట్టేస్తూ చేసిన వీరంగానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లోనే కొత్త సంవత్సరం రోజున 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు.
డిసెంబర్ 31 నుంచి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చాలాచోట్ల మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. శనివారం చాంద్రాయణగుట్టలో హుస్సేన్ అనే వ్యక్తి ఏకంగా చచ్చిపోయిన పాము కళేబరంతో ట్రాఫిక్ పోలీసులను బెదిరించారు. అంతకుముందు మమ్మల్ని సేఫ్‌గా ఇంటికి పంపండి..మీకు బాధ్యత ఉంది. అరంగంట నుంచి ట్రై చేస్తున్నా.. ర్యాపిడో బుక్ కావడం లేదు.. కారులో దిగబెట్టండి..లేకపోతే రోడ్డుపైనే కూర్చుంటానంటూ పోలీసులతో వాగ్వాదం చేసిన ఓ మందుబాబు వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది. మరోచోట డ్రంక్ అండ్ డ్రైవ్‌ల తనిఖీల్లో తనను పోలీసులు పట్టుకుని చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ నడిరోడ్డుపై పడుకుని హడావుడి చేశారు.
ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యవహారంలో తామేం చేయలేక సివిల్ పోలీసులను రప్పించే సమయానికే అతను పరారయ్యాడు. కుల్సుంపురలో ఓ యువకుడు కొత్త సంవత్సరం పూట కొద్దిగా తాగితే తప్పేంటంటూ ,బ్రీత్ అనలైజర్ ఎక్కువ తాగినట్లుగా చూపిస్తుందంటూ పోలీసులతో వాదనకు దిగారు. కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ తన బండి ఇప్పించంటూ బ్యారికేడ్ల దగ్గర పొర్లు దండాలు పెట్టారు. అంతేకాకుండా తన తలను గోడకు బాదుకుంటూ హడావిడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
సీజ్ చేసిన తన ఆటోను తిరిగి ఇవ్వకపోతే పామును వదులుతానంటూ పహాడీషరీఫ్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసులను బెదిరించారు. చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్‌ను ఆపి పరీక్షించారు. అతనికి పరీక్షల్లో 150 రీడింగ్ వచ్చింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు. ఆటోలో తన సామగ్రి ఉందంటూ ఆటో దగ్గరకు వెళ్లిన ఆ వ్యక్తి ఆకస్మాత్తుగా తన వాహనంలోనుంచి పాము తీసి చేతికి చుట్టుకుని పోలీసు అధికారి దగ్గరకు వచ్చి హల్చల్ చేశారు. ఘటనాస్థలం నుంచి పారిపోయిన హుస్సేన్‌ను పోలీసులు పట్టుకుని చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు. తాగిన మత్తులో ఉండగా తనను పోలీసులు పట్టుకుంటే ఆటోను వదిలేస్తారన్న ఆలోచనతో చనిపోయిన పామును పట్టుకుని పోలీసులను బెదిరించానంటూ హుస్సేన్ చెప్పారు.