సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): నగరంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం అర్ధరాత్రి, ఆదివారం తెల్లవారుజామున వేర్వేరు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో 8మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 33.3గ్రాముల కొకైన్,7.97 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెలితే….నగరానికి చెందిన మిస్బహుద్దీన్ ఖాన్, అలీఅస్గర్లు డ్రగ్స్‌కు బానిసలుగా మారారు. డ్రగ్స్ తీసుకోవడానికి తరచూ బెంగుళూరు వెళ్లి గ్రాము కొకైన్ రూ.9వేలచొప్పున కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చేవారు.
అమెరికా నుంచి నగరానికి వచ్చిన యూఎస్ఏ పౌరుడు జుబేర్ అలీ కారును వీరు రాకపోకలు సాగించేందుకు ఉపయోగించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు డ్రగ్స్ రవాణా చేస్తున్న మిస్బహుద్దీన్ఖాన్, అలీ అస్గర్లను రామ్‌కోఠిలోని వర్ధమాన్ బ్యాంక్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 33.3గ్రాముల కొకైన్‌తో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ప్రాంతంలో సూటీపై అక్రమంగా ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తున్న మీర్జా సాఫీ అలీ, అబ్దుల్ ఉబ వైట్ సయ్యద్, అబ్దుల్ హుస్సేన్‌లను అరెస్ట్ చేసి, 5.88 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపలి ప్రాంతంలో నాగుల సాయి ప్రవీణ్, మనోచందర్, శ్రీవర్ధన్లను అరెస్టు చేశారు. వారి నుంచి 2.07 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.