పటాన్చెరు టౌన్, మే 8 : పశువుల దాణా దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పటాన్చెరు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్ అన్నారు. పటాన్చెరు మండల పరిధిలో రెండు పశువుల దాణా దుకాణాలపై దాడులు జరిపినట్లు శుక్రవారం తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని పాటి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న శ్రీ రేణుక క్యాటిల్ ఫీడ్, చైతన్య నగర్ కాలనీ ఎంజీ రోడ్ పరిధిలోని లక్ష్మీ కృష్ణ క్యాటిల్ ఫీడ్ దుకాణాలపై గురువారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
పాటి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న పశువుల దాణా దుకాణంలో 200 మిల్లీ లీటర్ల ఆక్సిటోసిన్ ఔషదం 40 సీసాలు గుర్తించినట్లు తెలిపారు. అలాగే చైతన్యనగర్ కాలనీలోని పశువుల దాణా దుకాణంలో 250 మిల్లీ లీటర్ల ఆక్సిటోసిన్ 120 సీసాలను గుర్తించినట్లు తెలిపారు. చట్ట ప్రకారం నియమాల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో పటాన్చెరు డ్రగ్స్ సహాయ సంచాలకులు రాము, పాశమైలారం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, సంగారెడ్డి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రవికిరణ్ రెడ్డి, బొల్లారం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.