మేడ్చల్, మే 9 : నిషేధిత మాదకద్రవ్యాన్ని విక్రయించే వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు, మేడ్చల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ సామల వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంకు చెందిన పోతిరెడ్డి మోహర్ బాబా అలియాస్ రవి(35) బేగంపేటలోని కుందన్‌బాగ్ వర్థా అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నాడు. ఢిల్లీకి చెందిన జిన్నీ నుంచి నిషేధిత ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు.
సోమవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి కిష్టాపూర్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.3.80 లక్షల విలువచేసే 41 ప్యాకెట్లు ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా ఢిల్లీకి చెందిన జెన్నీ దగ్గర కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఓటీ సీఐ జేమ్స్ బాబు, ఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ దస్తప్ప, తదితరులు ఉన్నారు.