శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11: బర్త్ డే పేరు చెప్పి.. మద్యం మత్తులో మునిగిపోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న యువత పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పుట్టిన రోజు వేడుకల పేరుతో కొంతమంది ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో గంజాయి, హుక్కా, మద్యం వాడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. పార్టీలో పాల్గొన్న 18 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారి వద్ద 40 గ్రాముల గంజాయి లభించింది. గంజాయి తోపాటు హుక్కా పాట్స్, మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ పార్టీలో పాల్గొన్న 12 మంది యువకులు, ఆరుగురు యువతులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్ రావడంతో ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన 15 మందిపై కేసు నమోదు చేశారు. ఐటీ కారిడార్ పరిధిలోని టీఎన్జీఓ కాలనీ ఫైజ్ -1లోని అలాయ్ భలాయ్ చౌరస్తాలో ఉన్న లక్ష్మి అనే మహిళ ఇంట్లో రెండేండ్లుగా రిలియన్స్ ఇండస్ట్రీస్‌లో పని చేస్తున్న చరణ్, వినీల్, శివశంకర్ అద్దెకు ఉంటున్నారు.
వీరికి రాధా అనే స్నేహితుడు ఉండగా.. అతడి ద్వారా రైల్వేలో పనిచేసే ఆదిత్య అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆదిత్య పుట్టినరోజు వేడుక మంగళవారం టీఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న ఇంట్లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో మొత్తం 12 మంది యువకులు, ఆరుగురు యువతులు పాల్గొన్నారు. కాగా, పార్టీలో గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్నట్లు సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో 40 గ్రాముల డ్రై గంజాయి, హుక్కా పాట్స్, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బర్త్ డే పార్టీలో మొత్తం 18మందికి డ్రగ్స్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. అందులో ఆదిత్య, వీరనేని వరుణ్, సాయి ప్రవీణ్‌కు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన 15 మందిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. వరుణ్ గంజాయిని ధూల్‌పేట నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. పార్టీలోకి మొత్తం 50 గ్రాముల గంజాయిని తీసుకురాగా, 10 గ్రాములు సేవించారు. మిగిలిన 40 గ్రాములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పలువురు జూనియర్ ఆర్టిస్టులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు.