సిటీబ్యూరో, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): మహా నగరంలో ప్రస్తుతం నడుస్తున్న కార్లకు రీమోడలింగ్ (పునర్నిర్మాణం) జోరుగా కొనసాగుతుంది. పొడవు, పొట్టిగా ఉన్నవారు ఈ రీమోడలింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. పునర్నిర్మాణం అయిన కార్లను దివ్యాంగులు, మరుగుజ్జులు చకచకా నడుపుతూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు. వారి శారీరక భాగాలు డ్రైవింగ్‌కు అనూకూలించవని చాలా వరకు అంతా వారిని చిన్న చూపు చూస్తూ హేళన చేస్తుంటారు. కాని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని దివ్యాంగులు, మరుగుజ్జులు నిరూపిస్తున్నారు.
ఆర్టీఏ అధికారులు వారికి కల్పించిన వెసులుబాటుతో కార్ల కొనుగోళ్లు సైతం పెరుగుతున్నాయి. ఈ ఏడాది దివ్యాంగులు, మరుగుజ్జుల పేరుతో గ్రేటర్ పరిధిలో 177 కార్లు రిజిస్టర్ అయ్యాయి. వారందరికి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ అయ్యాయి. తాజాగా, నగరంలోని బంజారాహిల్స్‌కు చెందిన మరుగుజ్జు వ్యక్తి జి.శివలాల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం విశేషం. కాళ్లు, చేతులు ఇబ్బంది ఉన్న వారు వారికి అనుకూలంగా వాహనాలను రీమోడలింగ్ చేయించుకుని డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరవుతున్నారు. ఆర్టీఏ అధికారులు వారిని ప్రత్యేక కేటగిరీగా భావించి సేవలందిస్తున్నారు. లెర్నింగ్ దరఖాస్తు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయ్యే వరకు అనేక రకాల పరీక్షల అనంతరం, లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.
దివ్యాంగులు తమ వాహనాల రిజిస్ట్రేషన్లలో అనేక మినహాయింపులు పొందొచ్చు. జీఎస్టీతో పాటు లైఫ్ టాక్సీ కూడా వారు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ విధానం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటగా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి తనకు అనువుగా ఉన్న వెహికిల్‌ను ఎంపిక చేసుకోవాలి. కొటేషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో దానికి సంబంధించి జీఎస్టీ ఐప్లె చేయాలి. వారంలో కేంద్రం నుంచి అనుమత్రి పత్రం వస్తుంది. దానిని తీసుకుని షోరూంకు వెళ్లి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అప్పుడు వారికి జీఎస్టీ, లైఫ్ టాక్స్ మినహాయింపు వస్తుంది. ఆ బండిని తీసుకుని నగరంలోని “దక్కన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ గ్యారేజీ సెంటర్”కు తీసుకెళ్లాలి. ఈ సంస్థకే రాష్ట్రంలో కార్లను రీమోడల్ చేసే అనుమతి ఉంది. వాళ్లు సదరు వ్యక్తికి అనుగుణంగా క్లచ్, బ్రేకులు, సీటింగ్ విధానాల్లో మార్పులు చేస్తారు. ఆ వ్యక్తితో ట్రయల్ చేయిస్తారు. ఇంకేమైనా మార్పులు ఉంటే మాడిఫికేషన్ చేస్తారు.
అయితే, ఈ లోపున అతడు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన పీహెచ్సీ సర్టిఫికెట్ వివరాలను పరిశీలించిన అనంతరం, ఆర్టీఓ లెర్నర్ లైసెన్స్ జారీ చేస్తారు. లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని మాడిఫికేషన్ పూర్తయిన వాహనంతో రిజిస్ట్రేషన్‌కు సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. వాహన పత్రాలు, జీఎస్టీ వివరాలు, రీమోడల్ వాహనం సర్టిఫికెట్స్, లెర్నర్ లైసెన్స్ పరిశీలించిన అనంతరం, అతడి పేరుతో కారు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. నిర్ణీత సమయంలోపు టెస్ట్ డ్రైవ్‌కు హాజరై డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. అయితే, అతడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాన్ని మాత్రమే నడపాల్సి ఉంటుంది. మరే ఇతర వాహనం నడపకూడదు. అందుకు సంబంధించిన వివరాలన్నీ ఆర్టీఏ రికార్టుల్లో నిక్షిప్తం చేస్తారు.
నేను నా ఫ్యామిలీని కారులో తీసుకెళ్లాలని అనుకున్నాను. కాని, నాకు సాధ్యమవుతుందా? అని బాధపడ్డాను. ఎలాగైనా నేర్చుకోవాలని భావించాను. డ్రైవింగ్ నేర్చుకోవడానికి అన్నీ వాహన స్కూల్స్‌ను సంప్రదించాను. కాని, ఎవ్వరూ నేర్పించలేదు. నా మిత్రులు నాకు నేర్పించారు. కారు మోడిఫికేషన్‌కు మూడు నెలలు, డ్రైవింగ్‌కు 3 నెలల సమయం పట్టింది. రాష్ట్రంలో మరుగుజ్జులలో పర్మినెంట్ లైసెన్స్ పొందిన వారిలో నేనే మొదటి వాడిని. డ్రైవింగ్ నా భార్యకు కూడా నేర్పాలని అనుకున్నాను. ఆమె ప్రోత్సాహంతోనే డ్రైవింగ్ నేర్చుకున్నాను. చాలా మంది నన్ను చూసి నిరుత్సాహపరిచారు. కాని, నేను డ్రైవ్ చేయడం చూశాక వాళ్లు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. మరుగుజ్జులు తమ వైకల్యాన్ని చూసి కుంగిపోకుండా మన కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉన్నంతలో మనం ఏం చేయగలమో నిరూపించాలి. నా భార్యకు కూడా డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఐప్లె చేస్తాం. చరిత్రలో మరుగుజ్జుల నుంచి లైసెన్స్ పొందిన దంపతులుగా రికార్డులకెక్కాలని ఉంది.- శివలాల్, మొదట డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న మరుగుజ్జు వ్యక్తి
మేము దివ్యాంగులకు అనుగుణంగా వాహనాలను రీమోడలింగ్ చేస్తాం. మాకు ఆర్టీఏ అనుమతి ఉంది. మా లిస్ట్‌లో ఉన్న ఫార్చునర్, ఇన్నోవా, కియా సోనిట్, క్రెటా, ఫోర్డ్ మోడళ్లును రీమోడలింగ్ చేస్తాము. మిగిలినవి కూడా చేయొచ్చు. కాని, దానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కొంత ఫీజు ఛార్జీ చేస్తాం. కారు రీమోడలింగ్‌కు సమయం ఎక్కువగానే పడుతుంది. ఎందుకుంటే సదరు వ్యక్తికి అనుగుణంగా మాడిఫై చేయాల్సి ఉంటుంది. అనంతరం, మేము మాడిఫికేషన్ సర్టిఫికెట్ ఇస్తాం. మహ్మద్ షాజోర్ ఖాన్, దక్కన్ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ గ్యారేజీ