సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఔటర్ గ్రామాల ప్రజలకు సమృద్దిగా తాగునీరందించడమే లక్ష్యంగా జలమండలి మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ‘పట్టణ భగీరథ’లో భాగంగా ఇప్పటికే రూ.756.56 కోట్లను వెచ్చించి మొత్తం 70 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 164 రిజర్వాయర్లను నిర్మించింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 10 లక్షల కుటుంబాలకు తాగునీటిని అందిస్తున్నది. అయితే గ్రామకంఠం బయట ఏర్పడిన కాలనీలు ఈ ప్రాజెక్టు కిందకు రాలేదు. దీంతో మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తమ కాలనీలకు కూడా తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయా కాలనీల సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ప్రస్తుతమే కాకుండా.. భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా ప్రాజెక్టు రూపకల్పన చేయాలని జలమండలిని ఆదేశించింది. 2036 నాటికి ఈ ప్రాంతాల్లో జనాభా సంఖ్య 33.92 లక్షలకు పెరగనుందని అంచనా వేసి, ఇందుకనుగుణంగా జలమండలి డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది. అయితే గత సెప్టెంబర్‌లో రూ.1200కోట్ల ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఇటీవల రూ.1200కోట్ల ప్రాజెక్టు పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి జలమండలి అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 5న టెండర్ గడువు ముగుస్తుండగా, టెక్నికల్, ఫైనాన్స్ బిడ్స్ ఓపెన్ చేసి ఈ నెల 15 తర్వాత పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కొత్తగా 137 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, ఇన్లెట్లు, అవుట్ లెట్లను, 2093 కిలోమీటర్ల నూతన పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, బీపీఎల్ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం, క్లోరినేషన్ రూంలను నిర్మించడం, పైప్లైన్లు వేయడానికి తవ్విన రోడ్లను పునరుద్ధరించడం వంటి పనులను చేపట్టనున్నారు.
ప్రాజెక్టు కీలకాంశాలు..
సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు, ఆర్సీపురం, బొల్లారం మండలాల పరిధిలో రిజర్వాయర్లు (జీఎల్ఎస్ఆర్/ఈఎల్ఎస్ఆర్లు)లతో పాటు పైప్లైన్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇన్లెట్, ఔట్లెట్ పనులు సాగుతున్నాయి.
సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ (సీపీహెచ్‌ఈఈఓ) నిబంధనల మేరకు లీటర్స్ ఫర్ క్యాపిటా ఫర్ డే(ఎల్పీసీడీ) ప్రకారం భవిష్యత్ అవసరాలను అంచనా వేస్తూ ప్రాజెక్టును చేపడుతున్నారు.