DRF | సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): విపత్తు ఎలాంటిదైనా సరే.. మేం ఉన్నాం.. అంటూ హైదరాబాద్ పౌరులకు భరోసా ఇస్తోంది జీహెచ్ఎంసీ విపత్తు స్పందన దళం (డీఆర్ఎఫ్). జీహెచ్ఎంసీలో భాగమైన ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్, మేనేజ్మెంట్) కింద 2018వ సంవత్సరంలో ఏర్పాటైంది. పౌరులకు మెరుగైన సేవలందించేందుకు గాను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈవీడీఎం విభాగాన్ని నగర ప్రజలకు పరిచయం చేశారు. విపత్తు సమయాల్లో అద్భుత ప్రదర్శనతో ముందుండి ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం పౌరుల మన్ననలు పొందింది. డీఆర్ఎఫ్ ఎన్నో సందర్భాల్లో ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రతను తగ్గించింది. ప్రధానంగా 2020 అక్టోబరు భారీ వరదల సమయంలోను విపత్తు నివారణ చర్యలు చేపట్టింది. డీఆర్ఎఫ్ సేవలను గత ప్రభుత్వం ఇతర నగరాల్లోని మున్సిపాలిటీల్లో, ప్రధాన పట్టణాల్లోనూ అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే డీఆర్ఎఫ్ ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నది.
ఈ వర్షాకాలంలో ఎక్కడ, ఎలాంటి ప్రమాదం జరిగినా ముందుగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 20 బోట్స్‌ను సిద్దంగా పెట్టుకున్నారు. కుండపోత వర్షాలు కురిసిన లోతట్టు ప్రాంతాల వాసులకు సురక్షితంగా బయటకు తీసుకువచ్చేలా ఈ బోట్స్‌ను వినియోగించనున్నారు. 8 జేసీబీలు, బోట్స్ ఇంజిన్, స్కిడ్ స్టీర్ లోడర్ల యంత్రాలను వినియోగించనున్నారు. ప్రధానంగా ఐఎండీ, టీజీడీపీఎస్ , ఇతర ప్రైవేట్ వాతావరణ సంస్థల నుంచి వచ్చిన సమాచారాన్ని పౌరులకు ముందస్తుగా అలర్ట్‌గా చేయడం, అన్ని శాఖల సమన్వయం, ప్రమాద స్థలికి క్షణాల్లో చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడం లాంటివి చేపడుతున్నారు. మొత్తంగా వర్షం పడక ముందే రోడ్లపై ఉండి, అటు వాహనదారులకు, ఇటు ప్రజలకు అండగా నిలబడుతూ డీఆర్ఎఫ్ పౌరుల మన్ననలు పొందుతున్నది. గత ప్రభుత్వ చొరవతోనే ఈవీడీఎం సేవలు నేటికి సమర్థవంతంగా అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది ప్రజలకు ఎలాంటి ముంపు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా ముఖ్యమైన ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు రంగంలోకి దింపాం. ముంపు సమస్యలు నివారించేందుకు, బాధితులకు రక్షించేందుకు సుశిక్షితులైన సిబ్బందితో ఈవీడీఎం సిద్ధంగా ఉంది. వచ్చే అక్టోబరు నెలాఖరు వరకు ఒక్కో సర్కిల్‌కు ఓ డీఆర్ఎఫ్ బృందాన్ని నియమించాం. గ్రేటర్ వ్యాప్తంగా పడవలు, రక్షణ సామగ్రితో అన్ని వేళలా డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రత్యేకంగా కంట్రోల్ రూం నిరంతరం ప్రజలకు సేవలందిస్తాం. జనరేటర్, అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే పరికరాలు, ఇతరత్రా రక్షణ వస్తువులు డీఆర్ఎఫ్ బృందాలు కేటాయించిన ప్రాంతాల్లో ఉంటూ రక్షణ చర్యలు చేపడతారు.