హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ సర్కార్ అనుసంధానంతో.. డాక్టర్ విజయ్‌కుమార్ డాట్ల ఫౌండేషన్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ కలిసి.. నగరంలోని బొల్లారంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. నిరుద్యోగ యువతతో పాటు ఇతరుల్లో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా స్కిల్ సెంటర్ పనిచేయనున్నది. ఈ నైపుణ్య శిక్షణా కేంద్రంలో పరిశ్రమల సంబంధిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సమగ్రమైన జీవనోపాధి కల్పించే రీతిలో వ్యక్తులను తీర్చిదిద్దనున్నారు.
ఫార్మా, టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీ అండ్ వెల్నెస్, డిజిటల్ కమ్యూనికేష, రిటేలింగ్ లాంటి రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణ ఇవ్వనున్నది. స్థానిక యువత శిక్షణ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ప్రతి శిక్షణా కార్యక్రమం మూడు నెలల పాటు ఉంటుంది.శిక్షణ పొందిన, సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్లు.. ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఇక వొకేషనల్ కోర్సులకు కోసం ప్రత్యేకమైన విద్యార్హతలు ఏమీ అవసరం లేదు. కానీ ఇండస్ట్రియల్ కోర్సుల్లో శిక్షణ పొందాంటే మాత్రం .. పది లేదా ఐటీఐ, డిప్లమా, గ్రాడ్యుయేషన్ పూర్తి అయి ఉండాలి. పిల్లలు ఉన్న తల్లులు కూడా ఇక్కడ శిక్షణ పొందేలా ఏర్పాట్లు చేశారు.
నైపుణ్యాభివృద్ధి ద్వారా సమాజాభివృద్ధి సాధించాలన్న తమ అంకితభావానికి ఈ కేంద్రం ఓ గీటురాయి అవుతుందని డాక్టర్ విజయ్ కుమార్ దాట్ల ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ త్రిశన్య రాజు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సమాజ సాధికారత సాధించడం మార్పు వైపు ప్రయాణం అవుతుందని, ఇది కేవలం మిషన్ మాత్రమే కాదు అన్నారు. నిరుద్యోగ యువతలోని సామర్థ్యాన్ని.. బీఈ సిల్క్ సెంటర్ ద్వారా ..ఓ అవకాశంగా మార్చి, సమగ్ర అభివృద్ధి దిశగా, బంగారు భవిష్యత్తును అందించేలా మార్చనున్నట్లు చెప్పారు.
ఖాళీగా ఉన్న జీహెచ్ఎంసీ మోడల్ మార్కెట్ బిల్డింగ్‌ను .. బీఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌గా దాట్ల ఫౌండేషన్ మార్చింది. వీటిల్లో క్లాస్ రూమ్‌లు, క్యాంటీన్, కౌన్సిలింగ్ రూమ్, ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్‌లు, 16 సీట్ల కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సెంటర్లో సుమారు 180 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది దాదాపు 720 మంది వరకు ఇక్కడ శిక్షణ పొందే అవకాశం ఉన్నది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఈ డైరెక్టర్ ఇదిరా పీ రాజు, లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సీఈవో గౌతమ్ భట్టాచార్య పాల్గొన్నారు.