బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 24 : పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో ముగ్గురికి వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రాథమిక దశలోనే చిన్నారులలో వినికిడి శక్తిని, సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణి అన్నారు. బుధవారం గాంధీ దవాఖానలోని చెవి, ముక్కు, గొంతు విభాగంలోని సెమినార్ హాల్లో మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్ (ఎంవిఎఫ్) ఆధ్వర్యంలో ఐదుగురు చిన్నారులకు ఒక్కోటి రూ.50 వేల విలువ చేసే ఐదు డిజిటల్ వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఈఎన్టి విభాగం ప్రొఫెసర్, హెచ్ఓడి డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఇటీవల తాము 26 మంది వినికిడి సమస్యలు ఉన్న చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను నిర్వహించామని అన్నారు. ఎంవీఎఫ్ స్వచ్చంద సంస్థ సహకారంతో మరో 20 మంది ప్రీ ఇంప్లాంట్ థెరపీలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారులకు నెలలో 25 రోజుల పాటు ఉచితంగా స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన అన్నారు.
మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జీవీ.సేతురామన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా వినికిడి సమస్యలపై అవగాహన కల్పించడం, స్క్రీనింగ్ చేయడం, థెరపీ ద్వారా తల్లులకు, పిల్లలకు శిక్షణ అందించడం, ఏడాదికి 200 మంది పేదలకు ఉచితంగా దాతల సహకారంతో వినికిడి యంత్రాలను సమకూర్చడం లాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ దవాఖాన ఆర్‌ఎంఓలు డాక్టర్ శేషాద్రి, డాక్టర్ కల్యాణ్, డాక్టర్ యోగేందర్, ఎంవీఎఫ్ సంస్థ ప్రతినిథులు జీవి.సేతురామన్, వసంత సేతురామన్, అనంత కృష్ణన్, డాక్టర్ అరుణ, మురళీ నటరాజన్, ప్రసాదరావు, వెంకట్రామన్, పవిత్ కుమార్, రాఘవేంద్రరావు, గాంధీ ఈఎన్టి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ దీప్తి, డాక్టర్ తేజస్వి, డాక్టర్ సాగర్, డాక్టర్ రామ్‌జీ, డాక్టర్ సుమన్, డాక్టర్ రేవతి పాల్గొన్నారు.