అబిడ్స్, ఏప్రిల్ 23: విలియం షేక్స్పియర్ రచనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చదువుతారని, విశ్లేషిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మాజీ అధిపతి ప్రొఫెసర్ ఏ కరుణాకర్ అన్నారు. బుధవారం ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం, విలియం షేక్స్పియర్ జయంతిని పురస్కరించుకొని కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో వికాస భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
షేక్స్పియర్ ఒక ఆంగ్ల నాటక రచయిత, కవి , నటుడు అతను ఆంగ్ల భాషలో గొప్ప రచయితగా, ప్రపంచంలోని ప్రముఖ నాటక రచయితగా విస్తృతంగా పరి గణించబడ్డాడని ఏ.కరుణాకర్ అన్నారు. వికాస భారతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ కె రామ్ గోపాల్ రెడ్డి గత 25 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం ఉచిత సేవలందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, ఆంగ్లభాషాధిపతి, సాహితివేత్తగా సేవలందిస్తున్న డాక్టర్ ఎం సంగీతను ఈ ఏడాది విలియం షేక్స్పియర్ ఎక్సలెన్సీ అవార్డు 2025 ను ముఖ్య అతిథి శాలువా, జ్ఞాపిక, పూలమాల, ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించి అవార్డును ప్రదానం చేశారు.