సికింద్రాబాద్, మే 6: పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రసూల్‌పురా నారాయణ జోపిడి సంఘం బస్తీలో నూతనంగా నిర్మించనున్న సుమారు 288 డబుల్ బెడ్ రూం ఇండ్లకు శుక్రవారం బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి నిరుపేదకు డబుల్ ఇండ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. శంకుస్థాపన చేసిన ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఇన్నాళ్లు పూరి గుడిసెల్లో నివసించిన నిరుపేదలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో దళితబంధు పథకంతో దళితుల కుటంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డి, డీఈ గంగాధర్, ఏఈ మహేశ్‌తో పాటు టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, రెండో వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమార్ముదిరాజ్, ధన్‌రాజ్, మురళీయాదవ్, సదానంద్‌గౌడ్, నరేశ్, గప్పార్, నజ్మనిసా బేగం, బాద్షా, యూసఫ్, నాసర్, రహీమ్, జాహంగీర్, సాహిల్, అమర్ తదితరులు పాల్గొన్నారు.