మేడ్చల్, జనవరి 3(నమస్తే తెలంగాణ): అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం డబుల్ బెడ్రూమ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూమ్లు కేటాయించే ముందు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా అధికారులు చూడాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, జవహర్నగర్ మేయర్ కావ్య, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పావనీ యాదవ్, ప్రణిత గౌడ్, రాజేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డికి కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, మొక్కను అందజేశారు.