
చర్లపల్లి, నవంబర్ 3 : ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం పథకం ద్వార త్వరలో ఇండ్లు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, చిన్న చర్లపల్లి చెరువు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను బుధవారం వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెడుతున్నారని, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్ రూం పథకంలో వేలాది ఇండ్లను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అదేవిధంగా చర్లపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అన్ని హంగులతో 9 బ్లాక్‌ల్లో 360 రెండు పడక గదుల నిర్మా ణం పూర్తయిందని, త్వరలో అర్హులైన వారికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
రెండు పడకల గదుల ఇండ్లు ఇప్పిస్తామని పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే పూర్తయిన రెండు పడక గదుల నిర్మాణానికి సంబంధించి గృహాలు ఇప్పిస్తామని కొంత మంది మహిళల నుంచి డబ్బులు వసూలు చేసినట్ల్లు తన దృష్టికి వచ్చిందని, దళారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా రెండు పడకల గదుల ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే తనకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లను కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
చర్లపల్లి డివిజన్, రామకృష్ణానగర్‌లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామ కృష్ణానగర్‌లో ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కాలనీలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పారిశుధ్య పనులను వేగవంతం చేయడంతోపాటు వీధిదీపాల నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో సర్కిల్ ఈఈ కోటేశ్వర్రావు, డీఈ బాలకృష్ణ, ఏఈలు సత్యలక్ష్మి, ప్రత్యూష, డబుల్ బెడ్ రూం అధికారులు వెంకటేశ్వర్లు, సురేందర్‌నాథ్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డప్పు గిరిబాబు, అనిల్, నాయకులు ఎంపెల్లి పద్మారెడ్డి, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కేవీఎల్ఎన్రావు, గంప కృష్ణ, వినోద్, కడియాల బాబు, రెడ్డినాయక్, వంశీరాజు, సత్యనారా యణ, మహ్మద్ బాజీబాషా, అంజయ్య, కుమార్‌స్వామి, అభిషేక్, విజయ్‌రాజు, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు రామ్ప్రసాద్యాదవ్, అంకాలం రమేశ్, దేవరాజ్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.