చదివింది గుర్తుండటం లేదని చాలా మంది విద్యార్థులు సతమతమవుతుంటారు. తరగతి గదిలో విన్న పాఠాలు బయటకు వచ్చే సమయానికి గుర్తుండవు. పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ఎంత చదివినా.. తీరా పరీక్షల సమయానికి గుర్తుకు రావడం లేదని జుట్టు పీక్కునే పరిస్థితులు ఎదురవుతుంటాయి. గతం తాలూకు పరీక్షల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షల కాలాన్ని గట్టెక్కేందుకు విద్యార్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చదివింది గుర్తుంచుకోవడం ఎలా? అనే దానిని ప్రధానంగా తెలుసుకోవాలని అంటున్నారు. జ్ఞాపక శక్తిని పెంచుకుని ఒత్తిడి, ఆందోళన లేకుండా ఎలా ఉండాలో నిపుణులు సూచనలు చేశారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ):
మెదడుకు పదును..!!
పుస్తక పఠనంతోనే జ్ఞాపకశక్తి అధికం: మోతుకూరి రామచంద్రం, సైకాలజిస్టు.
పలుమార్లు చదివినా అవసరానికి ఏవీ జ్ఞాపకం రావు. ప్రతి ఒక్కరు నిత్యం ఏదో ఒకటి గుర్తుకు రాక బాధపడుతుంటారు. చిన్న వయసు నుంచే పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి. దాని వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతి విద్యార్థి ఆత్మ విశ్వాసంతో ఉండాలి. కష్టమైనా.. పరీక్ష రాయక తప్పదు. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగలననే ధీమా తప్పనిసరి. సంకల్ప బలంతో పరీక్ష గదిలో కూర్చోవాలి. అంతా మంచి జరుగుతుందనే మన మేథస్సును సానుకూల దృక్పథంతో ప్రతిస్పందించేలా చేస్తుంది. అప్పుడే చదివిన అంశాలు గుర్తుంటాయి.
సబ్జెక్టు అంటే భయపడకూడదు: లక్ష్మి, సైకాలజిస్టు
పాఠం చెప్పడం కన్నా.. అది ఎలా గుర్తుంచుకోవాలో చెప్పడమే ప్రధానం. నేర్చుకున్నవన్నీ వీలున్నప్పుడల్లా పునరుశ్చరణ చేసుకోవాలి. ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం. పరీక్షలకు అరగంట ముందు పాఠ్యాంశాలను చర్చించకూడదు. అలా చేస్తే గందరగోళంలో పడతారు. ప్రశ్నాపత్రం అందగానే రెండు నిమిషాలు ధ్యానం చేస్తే.. మనసులోనే వేర్వేరు ఆలోచనలు రావు. ప్రశాంతంగా పరీక్ష రాసుకునే శక్తి వస్తుంది. సబ్జెక్టు అంటే భయపడకూడదు. గణితం రాదని, సైన్స్ అంటే భయం అనే ఆలోచనలు ఉండరాదు. ప్రతిదాన్ని ఇష్టంతో చదవాలి.