హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : అటవీశాఖ పార్కుల్లోకి ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్‌తో తయారుచేసిన వస్తువులను అనుమతించవద్దని, వాటి నియంత్రణను అధికారులు సమర్థంగా అమలుచేయాలని ప్రధాన అటవీశాఖ అధికారి డాక్టర్ సువర్ణ ఆదేశించారు. ఆదివారం ఆమె కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును సందర్శించారు. వాకర్స్‌తో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పించే వసతులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్కులోని నెమళ్లు, పావురాలకు బయటి ఆహారం పెట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కులో కుక్కల బెడద తీవ్రంగా ఉందని వాకర్స్ చేసిన ఫిర్యాదును ఆమె పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎఫ్‌వోతోపాటు ఇతర ఉన్నతాధికారులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.