బేగంపేట్ అక్టోబర్ 2: ‘డాలర్ డ్రీమ్స్’ పుస్తకం అమెరికా విశ్వ విద్యాలయాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అమూల్యమైన మార్గదర్శి అని కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు. ప్రొఫెసర్ ఆలూరి సుభాష్ బాబు రచించిన ‘డాలర్ డ్రీమ్స్’ అనే పుస్తకాన్ని సికింద్రాబాద్ కిమ్స్ ప్రాంగణలో శనివారం ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ భాస్కర్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతియేటా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో చాలా మందికి తగిన మార్గదర్శనం లేక అటు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని, కొంతమందికి అవకాశం వచ్చినా చాలా ఖరీదు కావడంతో అందుకోలేక పోతున్నారని అన్నారు. విద్యార్థులు తమ అమెరికా కలలు నెరవేర్చుకోవడానికి ‘డాలర్ డ్రీమ్జ్’ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని అన్నారు.