నల్లకుంటలో ఓ పక్షి చెట్టుపై కుప్పకూలింది… పతంగి దారం కాళ్లకు తగిలి.. రెక్కలకు చుట్టుకొని.. ఎగరలేని స్థితితో గిలగిలలాడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఇద్దరు యువకులు.. ఆ పక్షిని రక్షించారు. వనస్థలిపురంలో ఎడమ వైపు దవడ పూర్తిగా పగిలిపోయి..ఇంట్లోకి చొరబడిన కుక్కనూ రాత్రి వేళ వచ్చి.. తమ వెంట తీసుకెళ్లి.. నయం చేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ బిగుసుకుపోయి.. చెట్టు కొమ్మలో చిక్కుకుపోయిన పిల్లినీ కాపాడి.. ప్రథమ చికిత్స అందించారు.
ఇలా వేళల్లో గాయపడిన మూగజీవాల బాధను తీర్చి.. సాంత్వన చేకూర్చి.. ఆత్మీయ స్పర్శ అందించారు..సిటిజన్ ఫర్ యానిమల్స్ సంస్థ ప్రతినిధులు పన్నీరు తేజ, పృథ్వీ సోదరులు. నగరంలో ఎక్కడైనా.. వన్యప్రాణులకు ప్రమాదం జరిగినా.. ఒక్క ఫోన్(నంబర్ 9603733207) చేస్తే చాలు ..అక్కడ వాలిపోతారు.. ఆ ప్రాణులను రక్షించి.. చికిత్స అందించి.. మామూలు స్థితికి తీసుకువస్తారు. వాటికి ఆశ్రయం కల్పించి.. తమ కుటుంబంలో ఒకటిగా గౌరవిస్తారు..ప్రేమిస్తారు. దశాబ్ద కాలంగా నల్లకుంట కేంద్రంగా..జంతువుల సంరక్షణలో తరిస్తూ…మానవత్వానికి చాటుకుంటున్నారు ఆ అన్నదమ్ములు . నేడు ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ జంతు ప్రేమికులపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
బ్లూక్రాస్ సొసైటీ స్ఫూర్తితో తేజ, పృథ్వీ సోదరులు 12 ఏండ్లుగా జంతు సేవలో తరిస్తున్నారు. వీరికి పలువురు సెలబ్రిటీల నుంచి ప్రోత్సాహం లభిస్తున్నది. బ్లూక్రాస్ సొసైటీ అక్కినేని అమల, జబర్ధస్త్ యాంకర్ రష్మీ, నటుడు అడవి శేష్, యాంకర్, నటి ఝాన్సీ ఇంకా టీవీ, సినిమా నటులు, వైద్యులు, స్నేహితులు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో జంతువులను రక్షించినట్లు ఆ సోదరులు తెలిపారు. నేడు ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా అందరూ మూగజీవాలను ఆదుకునేందుకు ముందుకురావాలని పిలుపునిస్తున్నారు.
జంతువుల మానసిక స్థితిని తెలుసుకోవడంతోపాటు, వాటికి చికిత్స చేసేందుకు వీరిద్దరూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. వరల్డ్ వెటర్నరీ సర్వీస్ సంస్థ నుంచి సర్టిఫికెట్ పొందారు. రోడ్డు ప్రమాదాలకు గురైన జంతువులకు స్వయంగా ట్రీట్మెంట్ చేస్తారు. తమ ఇంట్లో టెర్రస్‌పై ఏర్పాటు చేసిన శిబిరంలో వాటిని ఉంచి..కంటికి రెప్పలా చూసుకుంటారు. పూర్తిగా గాయాలు మానిన తర్వాతే ఎక్కడ దొరికిందో అక్కడే వదిలేస్తారు.
కరోనా విపత్తు, లాక్డౌన్ సమయంలో జంతువులు ఆహారం కోసం అల్లాడిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఈ సంస్థ ప్రతినిధులు వీధికుక్కలకు ఆహారాన్ని అందించారు. తమ ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా.. జంతువులపై ఉన్న ప్రేమతో ఎన్ని అవరోధాలు ఎదురైనా.. మూగజీవాలకు ఆత్మీయత పంచుతూనే ఉంటామని తేజ, పృథ్వీ స్పష్టం చేస్తున్నారు.
కాచిగూడ ప్రాంతంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలతో బాధపడుతున్న కుక్కను చూసిన ఓ వ్యక్తి మాకు ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా.. అది దీన స్థితిలో ఉంది.. బతకదేమో అనిపించింది. కానీ ఇంటికి తీసుకువచ్చి క్రమం తప్పకుండా చికిత్స చేసి నయం చేయగలిగాం. దానికి అంజు అని పేరు పెట్టాం. ఇప్పుడది మా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయింది.- పన్నీరు తేజ, జంతు ప్రేమికుడు
భూమి మీద మనకు జీవించే హక్కు ఎంత ఉందో జంతువులకూ అంతే ఉంది. వాటిని హింసించినా, చంపినా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. అలాంటి వారిపై ఇప్పటి వరకు 20కిపైగా కేసులు పెట్టించి.. కొందరికి శిక్షలు కూడా వేయించాం. మనం ఏమీ అనకుంటే మూగజీవాలు కూడా మన జోలికి రావు. మా సెంటర్లో ప్రతి నిత్యం 10 జంతువులు ఉంటాయి. ప్రత్యేక కేంద్రం, అంబులెన్స్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నాం. 30 మంది వలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాం. – పన్నీరు పృథ్వీ, జంతు ప్రేమికుడు