Basthi Dawakhana | సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ)/మైలార్‌దేవ్‌పల్లి/బాలానగర్/కుత్బుల్లాపూర్/ కొండాపూర్ : హైదరాబాద్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే మహోన్నత ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తే ఆ సమున్నత ఆశయానికి నేటి ప్రభుత్వం గండి కొడుతున్నది. చిన్న చిన్న వ్యాధులకు బస్తీ స్థాయిలోనే చెక్ పెట్టేందుకు అందుబాటులోకి వచ్చిననీ దవాఖానలు కాంగ్రెస్ పాలనతో అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
అందరికీ ఆరోగ్యం అందాలి.. రోగం బస్తీ స్థాయిలోనే నయమవాలి అనే తపనతో నాటి కేసీఆర్ సర్కారు ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖానను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో 2018లో 40 కేంద్రాలతో ప్రారంభమైన బస్తీ దవాఖానలు దశల వారీగా గ్రేటర్ వ్యాప్తంగా 292కు, రాష్ట్ర వ్యాప్తంగా 468కి విస్తరించాయి. ఈ బస్తీ దవాఖానల్లో ప్రాథమిక వైద్యంతో పాటు 55రకాల రోగ నిర్ధారణ పరీక్షలు జరిగేవి. 125 రకాల మందులను ఇచ్చేవారు. దీంతో సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా కట్టడి చేసేవారు.
వాటి ప్రారంభ దశలోనే అలాంటి వ్యాధులను బస్తీ గడప దాటనీయకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా విశేష కృషి చేసింది. కరోనా వ్యాప్తి చెందిన విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానలు మూతబడితే నగరవ్యాప్తంగా అనేక బస్తీ దవాఖానాలు రోగులను అక్కున చేర్చుకొని చికిత్సను అందించాయి. కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సిన పనిలేకుండా, లాక్డౌన్ కారణంగా సరిహద్దుల వద్ద పోలీసులను బ్రతిమాడాల్సిన అవసరం లేకుండా ప్రజలు తమ ఇంటికి అతి సమీపంలోనే కాలినడకన వెళ్లి వైద్యం తీసుకుని తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నారు.
ఇంతటి ప్రాముఖ్యత, గుర్తింపు పొందిన బస్తీ దవాఖానలకు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 15 నెలల స్వల్ప కాలంలోనే నిర్లక్ష్యపు సుస్తీ పట్టుకున్నది. వైద్యలు లేక.. నర్సులే వైద్యు లై నగరంలోని బస్తీ దవాఖానల్లో వైద్యులు లేకపోవడంతో గత్యంతరం లేక నర్సులే రోగులకు చికిత్స అందిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 292బస్తీ దవాఖానల్లో హైదరాబాద్ పరిధిలోని 169 బస్తీ దవాఖానలు మినహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 123బస్తీ దవాఖానల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. మరికొన్ని బస్తీ దవాఖానల్లో కేవలం ఒక్కరే వైద్యుడు ఉండడంతో వారు సెలవుపై వెళ్లిన సమయంలో అక్కడ కూడా నర్సులే దిక్కవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్తీ దవాఖానల్లో 125రకాల మందులను నాటి బీఆర్ఎస్ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో జ్వరం, జలుబు, దగ్గు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన అన్ని రకాల మందులను బస్తీ దవాఖానల్లోనే పంపిణీ చేయడంతో ఉస్మానియా, గాంధీ వంటి స్పెషాలిటీ దవాఖానలపై భారం తగ్గింది.
కాని ప్రస్తుతం బస్తీ దవాఖానల్లో నెలకొన్న మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవడమే కాకుండా వారు వైద్యం కోసం బస్తీ గడప దాటి ఉస్మానియా, గాంధీ లేదా ప్రైవేటు దవాఖానల బాట పట్టాల్సి వస్తోందని బాధిత రోగులు ఆరోపిస్తున్నారు. రోగులు కూర్చునేందుకు కనీసం కుర్చీలు, ముఖ్యంగా వైద్యపరీక్షల నిమిత్తం మూత్ర నమూనాలు ఇచ్చేందుకు మూత్రశాలలు లేకపోవడం, చాలా రకాల వైద్యపరీక్షలను సైతం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోగులు లక్షణాలు చెబితే వారికి ఉన్న అవగాహన మేరకు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. దీంతో సరైన సమయంలో సరైన చికిత్స అందక రోగులు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని బస్తీ దవాఖానల్లో నమూనాలు సేకరించేందుకు అవసరమైన సిబ్బంది లేక 55రకాల వైద్యపరీక్షలకు గాను పరిమితంగా అతి తక్కువ వైద్యపరీక్షలు చేస్తున్నారు. మరికొన్ని దవాఖానల్లో వైద్యపరీక్షల కోసం వచ్చే రోగులకు ఇతర కేంద్రాలకు లేదా ప్రైవేటు ల్యాబ్‌లకు పంపుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని బస్తీ దవాఖానలన్నీ స్థానికంగా ఉండే ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్నాయి. అయితే బస్తీ దవాఖానల కోసం ప్రత్యేకంగా మందులు కేటాయించడం లేదు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఉన్న పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలకు మాత్రమే ప్రతి మూడు నెలలకు ఒకసారి మందులను మంజూరు చేస్తున్నారు. అయితే పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలకు కూడా రోజువారి రోగులు వస్తూనే ఉంటారు.
వాటి పరిధిలోకి అదనంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడంతో ఇచ్చే మందులు అటు పీహెచ్‌సీలు, ఇటు బస్తీ దవాఖానలకు సరిపోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ప్రస్తుతం పిహెచ్సీలకు కేటాయించే మందుల్లోనే బస్తీ దవాఖానలకు కూడా పంపిణీ చేయాల్సి రావడంతో మందుల కొరత తలెత్తుతోందని సిబ్బంది చెబుతున్నారు. బస్తీ దవాఖానల కోసం అదనంగా మందులను మంజూరు చేస్తే సమస్య తీరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు.
అత్తాపూర్‌లోని పాండురంగనగర్ బస్తీ దవాఖానలో వారంలో ఒకరోజు మాత్రమే వైద్య పరీక్షలు చేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేరు. ప్రభుత్వం అందిస్తున్న మందులు 15 రోజులకు మాత్రమే సరిపోతున్నాయి. దీంతో రోగులకు సిబ్బందికి మధ్య గొడవలు తప్పకారి
జిల్లా పరిధిలో మొత్తం 76 బస్తీ దవాఖానలు రోగులకు సేవలు అందిస్తున్నాయి. అయితే బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యుల్లో కొంత మంది వైద్యులు పీజీ సీట్లు రావడం, ఇతర అవకాశాలు రావడంతో రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. దీంతో అక్కడక్కడ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 11మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే రెండు మూడు రోజుల్లో వైద్యుల నియామకం పూర్తవుతుంది. రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం.
– డా.వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి