హైదరాబాద్ : ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 3 కిలోల కణితిని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. ఈ మూడు కిలోల కణితిని తొలగించేందుకు 3 గంటల పాటు శ్రమించారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుని, ఆరోగ్యంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే అమెరికా నుంచి ఓ మహిళ(30) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. దీంతో ఏప్రిల్ 18న నిజాంపేట్‌లోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది. డాక్టర్లు ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా, గర్భాశయంలో పెద్ద కణితి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పా గట్టా, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శిరీష మల్లమూరి కలిసి బాధితురాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. మూడు గంటల పాటు శ్రమించి, 3 కిలోల కణితిని గర్భాశయం నుంచి తొలగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శిల్పా గట్టా మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం బాధితురాలు అమెరికాలో సిజేరియన్ చేయించుకుంది. ఆ సమయంలో ఆమె గర్భాశయంలో వైద్యులు కణితిని గుర్తించలేదు. ఆ తర్వాత కణితి క్రమక్రమంగా పెరిగింది. అయితే ఓ శిశువు స్థాయిలో ఉన్న కణితిని తొలగించేందుకు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.