భన్సీలాల్పేట, మార్చి 3 : పద్మారావు నగర్లోని కౌతా కామకోటి కల్యాణ నిలయంలో రుషి పీఠం పురస్కార ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. రుషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారతదేశంలో సనాతన ధర్మాన్ని, దాని ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవడం, భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆయుర్వేద వైద్యం విధానం అత్యంత పురాతనమైనదని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షణ కోసం రుషి పీఠం చేపడుతున్న ప్రోత్సాహక కార్యక్రమాలను ఆయన అభినందించారు.
రుషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ.. 1999లో ఏర్పాటైన రుషి పీఠం ద్వారా ఆధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, సేవా రంగాలలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి, పురస్కారాలను ప్రతి ఏటా అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు సంస్కృత భాషా బోధన, భగవద్గీత పఠనం, సౌందర్య లహరి తరగతులు, గో సేవ, వేద విద్య సేవ, వైద్య శిబిరాల నిర్వహణ లాంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు, రచయిత్రి డాక్టర్ అల్లంరాజు గాయత్రీ దేవి, దంపతులకు రుషి పీఠం 2024 పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వివిఎస్ రామశాస్త్రి, గుజరాత్ లోని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. విద్యానాథ్, రుషి పీఠం ట్రస్టీ మారేపల్లి సూర్యనారాయణ, సభ్యులు ఆంజనేయ శాస్త్రి, రాధాకృష్ణ, నారాయణరావు, రమణమూర్తి, పుల్లయ్య శర్మ, మల్లాది ప్రసాద్, మురళీకృష్ణ, అమర్నాథ్, హనుమంతరావు, వేణుగోపాల్, శాస్త్రి, శర్మ సిద్ధారెడ్డి, రఘురాం, తదితరులు పాల్గొన్నారు.