వెంగళరావునగర్, అక్టోబర్ 25: అనుమానాస్పద స్థితిలో వైద్యురాలు మృతి చెందిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన సుభాష్ సోమాసింగ్ పవార్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు నేహా పవార్ (25) బంగ్లాదేశ్‌లోని జీఎంసీ వైద్య కళాశాలలో ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె నిబంధనల ప్రకారం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్షకు హాజరయ్యేందుకు శిక్షణ కోసం అమీర్‌పేటలోని మీడియన్ ప్లాజాలోని మిస్ట్ కోచింగ్ సెంటర్లో చేరింది.
సమీపంలోని బీవీకే గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న నేహా పవార్.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కడుపునొప్పిగా ఉందంటూ ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో హాస్టల్ వాచ్‌మన్ ఆమె తండ్రికి సమాచారమిచ్చాడు. తిరిగి 9 గంటల సమయంలో నేహా తల్లిదండ్రులకు ఫోన్ చేసిన వాచ్‌మన్.. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేహా పవార్ మృతి చెందినట్టు చెప్పాడు. మరుసటి రోజు గురువారం నగరానికి చేరుకున్న తల్లిదండ్రులు.. కూతురు మరణం పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.