అమీర్‌పేట్, డిసెంబర్ 2 :బల్కంపేట ఎల్లమ్మ భక్తుల సౌకర్యార్ధం దేవాలయ పరిసరాల్లో దాతల చేయూతతో నిర్మించిన షెడ్డు ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచిందని అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో మంత్రి హోదాలో అన్నీ తానై ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి పూనుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ భక్తుల గుండెల్లో ఎన్నటికీ చెదిరిపోని స్థానం సంపాదించుకున్నారన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో లోక కల్యాణంగా ఎల్లమ్మ కల్యాణాన్ని నిర్వహించడం కోసం దేవాలయం ఎదుట భారీ షెడ్డు నిర్మాణానికి పూనుకోవడం వంటి పనులు దేవాలయ ప్రాచుర్యాన్ని మరింత పెంచాయన్నారు.
ఈ షెడ్డు నిర్మాణం వల్ల ఆషాఢ వర్షాల సమయంలో జరిగే ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి అవాంతరాలు లేకుండా ఉండడం, ఇతర సమయాల్లో అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎండ, వానల నుండి ఉపశమనం కలిగేలా ఉందని చెప్పారు. ఇప్పుడు దేవాలయంలో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదటిసారి కొలువుదీరిన ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి ఇప్పటివరకు చెప్పుకోదగిన పనులేవీ చేపట్టకపోగా, దాతలు, భక్తులు, బల్కంపేట బస్తీవాసుల చేయూతతో షెడ్డు నిర్మాణానికి కృషి చేసిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరు ఎక్కడా కనిపించకుండా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుందని శేషుకుమారి ఆరోపించారు. మంత్రి హోదాలో తానే ముందుండి దాతగా నిలిచి సేవా దృక్పదం కలిగిన దాతలతో కలిసి నిధులు సేకరించి భారీ షెడ్డు నిర్మాణం చేపడితే, అప్పటి దాతలే స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరైతే సమంజసంగా ఉంటుందనే ఉద్దేశంతో షెడ్డుకు బోర్డును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఇప్పుడు ఈ బోర్డును తొలగించేందుకు పాలక మండలి సభ్యులు కుట్రలు చేస్తుండడాన్ని భక్తులు గమనిస్తున్నారని, ఎల్లమ్మ దేవాలయ షెడ్డుకు అమర్చిన బోర్డును తొలగించేందుకు ఎవరినీ అనుమతించవద్దని కోరుతూ మంగళవారం శేషుకుమారి నేతృత్వంలో ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి మాజీ సభ్యులు ఎం.హనుమంతరావు, అశోక్‌యాదవ్, కూతురు నర్సింహ, కట్టా బలరామ్, దాసోజు పుష్పలత తదితరులు ఎస్ఆర్నగర్ ఏసీపీ రాఘవేందర్రావు, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డిలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసే పనులకు ప్రాముఖ్యతనివ్వాలని, పనికిరాని పనులతో భక్తులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు.