కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 10: బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కూకట్పల్లి జోన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, నర్సరీలను నగర కమిషనర్ రోనాల్డ్ రోస్ సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మూసాపేట సర్కిల్లోని కైత్లాపూర్, జగద్గిరిగుట్ట హెచ్‌ఎంటీలోని సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (ఎస్‌సీటీపీ) పరిశీలించడంతో పాటు కేపీహెచ్‌బీ కాలనీ రమ్యా గ్రౌండ్ వద్ద తరచుగా చెత్తవేసే ప్రాంతం (జీవీపీ), గాజుల రామారంలోని నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీలు, బస్తీలలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛ ఆటో వెళ్లేలా చూడాలని.., ప్రతి ఇంట్లో వెలువడే చెత్తను స్వచ్ఛ ఆటోలోనే వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తరచు చెత్తవేసే ప్రాంతాల (జీవీపీ)పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ ప్రాంతంలో చెత్త వేస్తున్న వారిని గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. కాలనీలు, బస్తీల నుంచి ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. కైత్లాపూర్ ఎస్సీటీపీకి రోజు ఎంత చెత్త వస్తుంది? ఎన్ని స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త వ్యర్థాలు తరలిస్తున్నారు? నిర్మాణ వ్యర్థాలు ఎక్కడికి తరలిస్తున్నారు? స్వచ్ఛ ఆటోలకు స్కానింగ్ సక్రమంగా జరుగుతుందా? స్వచ్ఛ ఆటోలు నిర్దేశిత కాలనీలకు ప్రతిరోజూ వెళ్తున్నాయా? అన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని వందశాతం స్వచ్ఛతను సాధించేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్సీ మమత, డీసీలు రవి కుమార్, రవీందర్ కుమార్, ఏఎంహెచ్‌వో సాల్మాన్, ఇంజినీరింగ్, రాంకీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.