Runa Mafi | మేడ్చల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/దుండిగల్: రుణమాఫీ పథకం వర్తింపుకాని రైతులు గ్రీవెన్స్ సెల్‌లను ఆశ్రయిస్తున్నా.. ఫలితం ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గ్రీవెన్స్ సెల్స్ పేరుకే అన్నట్లు ఉన్నాయని, దరఖాస్తుల స్వీకరణే పరిమితమవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ పథకానికి సుమారు 30 వేల పైచిలుకు అర్హులుంటే రుణమాఫీ అయ్యింది మాత్రం 3,436 మందికే. దీంతో అర్హత ఉన్న రైతులందరూ గ్రీవెన్స్ సెల్‌లను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 గ్రీవెన్స్ సెల్‌లను ఏర్పాటు చేసినప్పటికీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వడమే తప్ప..
రుణమాఫీ పథకం వర్తింపుజేసేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రీవెన్స్ సెల్‌లలో ఇప్పటి వరకు 421 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. రుణమాఫీ పథకం మూడు విడతలు పూర్తయిన నేపథ్యంలో గ్రీవెన్స్ సెల్‌లకు దరఖాస్తుల చేసుకునే రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు.
ఆడిట్ పూర్తయినా..
జిల్లాలోని పూడూర్, ఘట్కేసర్, అల్వాల్ సహకార సంఘాల్లో ఇటీవలే ఆడిట్ పూర్తయినా.. ఇప్పటి వరకు అర్హులైన రుణమాఫీ కాలేదు. రుణమాఫీ పథకం ప్రకటించిన సమయంలో ఆడిట్ పూర్తికానందున మూడు సహకార సంఘాల గ్రామాలకు చెందిన రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి..తప్పించుకున్న ప్రభుత్వం.. తాజాగా ఆ ప్రక్రియ పూర్తయినా.. ఎందుకు రుణమాఫీ చేయడం లేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. తమకు తక్షణమే రుణమాఫీ వర్తింపజేయాలని మూడు సహకార సంఘాల గ్రామాల పరిధి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అసత్య ప్రచారం.. అబద్ధపు మాటలు
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
అసత్య ప్రచారం,అబద్ధపు మాటల పునాదులపై కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గండిమైసమ్మ చౌరస్తాలోని బౌరంపేట్ సహకార సంఘం బ్యాంక్ వద్ద ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ విధానాలను నిరసిస్తూ బౌరంపేట్, దుండిగల్ గ్రామాలకు చెందిన రైతులు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే వివేకానంద్ హాజరై మాట్లాడుతూ ఎన్నికల అనంతరం గతేడాది డిసెంబర్ 9లోపు రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి..కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు.
ప్రతి రైతుకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామని చెబుతూ.. రైతాంగాన్ని నట్టేటా ముంచిందన్నారు. బౌరంపేట్, దుండిగల్ బ్యాంక్‌లో మొత్తం 632 మంది రైతులు రుణం పొందితే.. కేవలం14 మందికే రుణమాఫీ చేశారన్నారు. ఒక వేళ ప్రభుత్వం కొర్రీలు పెట్టి మిగతా రైతులకు రుణమాఫీ చేయకపోతే మోసపూరితంగా గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి భేషరతుగా అన్నదాతలకు క్షమాపణ చెప్పి గద్దెదిగాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ విద్దెల బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, డైరెక్టర్లు భీమ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, శ్రీనివాస్, రైతులు నర్సిరెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.