Hyderabad | సిటీబ్యూరో, మార్చి 15 ( నమస్తే తెలంగాణ ): సైనికుల కుటుంబాలకు ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా సైనిక్ బోర్డ్ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వితంతువులు సైతం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సైనిక్ బోర్డు సమావేశం జరిగింది. సైనిక కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కూడా రావాల్సి ఉన్నదని, మాజీ సైనిక కుటుంబాలకు పావలా వడ్డీ పథకం ఉన్నప్పటికీ వారికి బ్యాంకు నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
డబుల్ బెడ్రూమ్ పథకంలో 2 శాతం రిజర్వేషన్ కూడా ఉన్నదని, అమలు కావడం లేదంటూ కలెక్టర్కు వివరించారు. ఈ సమస్యలన్నింటిపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించేలా తాసీల్దార్లకు ఆదేశాలిస్తామని తెలిపారు. రెండు నెలల్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని, బ్యాంక్ నుంచి అందాల్సిన సాయంపై సిబ్బందితో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవానికి విరాళాలు భారీగా వచ్చేలా కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ బోర్డు సెక్రటరీ శ్రీనేశ్ కుమార్, కల్పణా వేణుమాదవ్, సురేశ్ కుమార్, శిల్ప ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.