సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): డెంగీ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వైద్యాధికారులకు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి ప్రైవేటు దవాఖాన యాజమాన్యాలను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభంతో ప్రస్తుతం నగరంలో అక్కడక్కడ డెంగీ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామని, రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రైవేటు దవాఖానకు వచ్చే డెంగీ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు తెలియతెలియజేయాలని ఆదేశించారు. సరైన వైద్యపరీక్షలు చేయకుండా డెంగీ పేరుతో రోగులకు అవసరం లేని చికిత్స చేసినా, చికిత్స పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నా చట్టరీత్యా చర్యలు తప్పవని డాక్టర్ వెంకటి హెచ్చరించారు.
జూబ్లీహిల్స్: డెంగీపై సమరంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ క్యూ ఆర్ కోడ్‌ను విడుదల చేసింది. ఈ కమ్యూనిటీ సర్వీస్‌లో ‘మేము సైతం’.. అంటూ ముందుకొచ్చే విద్యార్థులు ఈ క్యూ ఆర్ కోడ్‌తో ఈనెల 21 వరకు తమ దరఖాస్తులను పంపవచ్చు.